తెలంగాణలో ప్లాస్టిక్ బియ్యం… తిన్నారంటే ప్రాణాలకే ప్రమాదం..?

కాదేదీ కల్తీకి అనర్హం అన్న విధంగా కొందరు అక్రమార్కులు తినే బియ్యాన్ని కూడా కల్తీ చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం కలుపుతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. రాష్ట్రంలో పేద ప్రజలకు ప్రభుత్వం అందజేసే రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. ఆదిలాబాద్ జిల్లా హాజీపూర్‌ మండలానికి చెందిన ఒక రేషన్ దుకాణంలో ప్లాస్టిక్ బియ్యం దర్శనమిచ్చింది.

నిన్న రేషన్ బియ్యం తీసుకున్న వారిలో కొందరు బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం కలిసినట్లు గుర్తింపు రేషన్ దుకాణం ముందు ధర్నా చేయడంతో పాటు తహశీల్దార్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో ఇతర ప్రాంతాల్లో రేషన్ బియ్యం తీసుకునే వాళ్లు సైతం కంగారు పడుతున్నారు. మండలోని వేంపల్లి రేషన్ దుకాణంలో చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్రంలోని ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. గ్రామస్థులు ప్లాస్టిక్ బియ్యాన్ని కాల్చగా ఆ బియ్యం నల్లబడటంతో పాటు ఒకదానికొకటి అతుక్కుంది.

అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని బియ్యం బస్తాలను పరిశీలించి నిజంగానే బస్తాలలో ప్లాస్టిక్ బియ్యం ఉన్నట్టు గుర్తించారు. అధికారుల తనిఖీలలో మొత్తం 138 బస్తాల్లో ప్లాస్టిక్ బియ్యం ఉన్నట్టు తేలింది. తహశీల్దారు జమీర్ బియ్యాన్ని ల్యాబ్ కు పంపుతామని ల్యాబ్ రిపోర్టులు వచ్చిన అనంతరం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్లాస్టిక్ బియ్యం ఉన్నట్లు రుజువైతే తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

స్థానికులు అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపణలు చేయగా తాత్కాలికంగా రేషన్ పంపిణీ ఆగిపోయింది. ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్ బియ్యం ప్లాస్టిక్ బియ్యం అని తేలడం స్థానికంగా చర్చనీయంశం అయింది.