వామ్మో.. ఇతను ఏడాదిలో 300 రోజులు నిద్రలోనే ఉంటాడు.. కారణం ఏమిటంటే?

సాధారణంగా ప్రతి రోజూ మనం ఎనిమిది గంటల పాటు నిద్ర పోతే ఎంతో ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చు. ఎనిమిది గంటలకు మించి నిద్రపోతే తీవ్రమైన తలనొప్పి మనల్ని వెంటాడుతుంది.అయితే మనం పురాణాలలో కుంభకర్ణుడు ఆరు నెలల పాటు నిద్రపోతే మరో ఆరు నెలల పాటు మేల్కొని ఉంటాడు అనే సంగతి వినే ఉంటాము. కానీ రాజస్థాన్ కు చెందిన ఓ వ్యక్తి మాత్రం కుంభకర్ణుడిని మించి నిద్రపోవడం విశేషం. ఈ వ్యక్తి ఏడాదిలో సుమారుగా 300 రోజులు నిద్రలోనే ఉంటాడు. ఈ విధంగా నిద్ర పోవడానికి కారణం ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..

రాజస్థాన్‌‌లోని నగౌర్‌కు చెందిన పుర్కారామ్ అనే వ్యక్తి వయస్సు 42 ఏళ్లు. భద్వా గ్రామంలో నివసిస్తున్నాడు. ఇతను ఏడాదిలో 300 రోజులు నిద్రలోనే ఉంటాడు. పుర్కారామ్ ఒక్కసారి నిద్రలోకి వెళ్ళాడు అంటే ఇక 25 రోజుల పాటు ఎంత లేపినా నిద్రనుంచి లేవడు. ఈ విధంగా నెలలో కేవలం అయిదు రోజులు మాత్రమే మెలకువలో ఉంటాడు. అయితే ఇతను సరదాగా ఇలా నిద్రపోతున్నాడు అంటే మనం పొరపాటు పడినట్లే.

పుర్కారామ్ ఈ విధంగా నిద్ర పోవడానికి గల కారణం అతనిని వెంటాడుతున్న “యాక్సిస్ హైపర్సోమ్నియా” అనే అరుదైన వ్యాధే కారణం. అయితే తన ఆర్థిక పరిస్థితుల కారణంగా చికిత్సకు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే తమ జీవనాధారం కోసం ఒక కిరాణా అంగడి నిర్వహిస్తున్న ఇతను కేవలం ఐదు రోజులు మాత్రమే షాపును తెరుస్తున్నాడు.

ఈ సందర్భంగా పుర్కారామ్ భార్య లక్ష్మీదేవి మాట్లాడుతూ.. గత కొంతకాలం వరకు రోజుకు 15 గంటలు మాత్రమే నిద్ర పోయేవాడు. వయసు పెరిగేకొద్దీ అతడు నిద్రపోవడం కూడా పెరుగుతోందని తెలిపింది. అతడు నిద్రలో ఉండగానే అతడికి స్నానం చేయించి ఆహారం తినపెడతామని లక్ష్మీదేవి తెలిపారు. ఒక్కసారి నిద్ర లోకి వెళ్ళాడంటే ఎంత ప్రయత్నించినా లేవడని నిద్ర లేవగానే తీవ్రమైన తలనొప్పితో బాధపడతారని ఈ సందర్భంగా భార్య లక్ష్మీదేవి తెలిపారు.