ఆశ్చర్యం: ఓకే మహిళకు 31 సార్లు కరోనా పాజిటివ్..!

దాదాపు సంవత్సరం క్రిందట కరోనా మహమ్మారి అన్ని దేశాలకు వ్యాపించడంతో పాటు, భారతదేశంలో కూడా ఉగ్రరూపం దాల్చింది. ఈ నేపథ్యంలోనే ఈ మహమ్మారిని అడ్డుకోవడానికి అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. ఈ మహమ్మారికి సంబంధించిన ఒక విషయం అందరినీ ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది. కరోనా వైరస్ ఒకే మహిళకు ఏకంగా 31 సార్లు పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎలాంటి కరోన లక్షణాలు లేకుండా ఆమెకు తరచూ పాజిటివ్ అని రావడంతో వైద్యులు, శాస్త్రవేత్తలు ఆమె నమూనాలను సేకరించి పరిశోధనలను ప్రారంభించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.

రాజస్థాన్‌లోని అప్నాఘర్‌ ఆశ్రమానికి చెందిన శారదకు కరోనా లక్షణాలు ఏమీ లేవు. అయినప్పటికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ప్రతిసారి ఆమెకు పాజిటివ్ అని నిర్ధారణ అవుతుంది. గత ఏడాది ఆగస్టు 20న ఆమెకు తొలిసారి కరోనా నిర్ధారణ పరీక్ష చేయగా అందులో పాజిటివ్ అని తేలడంతో చికిత్స నిమిత్తం ఆ మహిళను భరత్‌పూర్‌ జిల్లాలోని ఆర్‌బీఎం ఆస్పత్రిలో చేర్పించారు.అక్కడ చికిత్స పొందుతున్న ఆ మహిళకు వైద్యులు పలుమార్లు కరోనా పరీక్షలు నిర్వహించగా ప్రతిసారి ఆమెకు పాజిటివ్ అని నిర్ధారణ అవుతుంది. ఇప్పటివరకు 31 సార్లు పరీక్షలు నిర్వహించగా, అన్నిసార్లు పాజిటివ్ అని రావడంతో డాక్టర్లు ఆశ్చర్యపోతున్నారు.

మొదటిసారి ఆ మహిళకు పాజిటివ్ వచ్చినప్పుడు ఎంతో నీరసంగా ఉండేదని, కేవలం నిలబడటానికి కూడా చేత కాకుండా ఉన్న ఆమె ప్రస్తుతం ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటూ, ఎలాంటి లక్షణాలు లేవు. అంతేకాకుండా ఆ మహిళ దాదాపు ఎనిమిది కిలోల బరువు కూడా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఆ మహిళకు మొదటిసారి కరోనా నిర్ధారణ అయిన తర్వాత చికిత్స తీసుకున్న అనంతరం వైరస్ శరీరంలో ఉండటం వల్ల ఎన్నిసార్లు నిర్ధారణ పరీక్షలు చేసినప్పటికీ ఆమెకు పాజిటివ్ అని వస్తుందని వైద్యులు భావించారు. అయితే ఈ విషయం గురించి పూర్తిగా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఈమె నమూనాలను సేకరించి వాటిపై అధ్యయనాలు కొనసాగిస్తున్నారు