మనుషుల నుంచే జంతువులకు కోవిడ్ వ్యాప్తి.. వెల్లడించిన శాస్త్రవేత్తలు!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కరోనా వైరస్ మనుషుల నుంచి మనుషులకు వ్యాపించడం మనం చూస్తున్నాము. ఈ క్రమంలోనే కరోనా బారినపడిన యజమానులు వారి ఇళ్లల్లో పెంచుకుంటున్న పిల్లులు, కుక్కలలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని తాజాగా యూరోపియన్‌ క్లినికల్‌ మైక్రోబయాలజీ అండ్‌ ఇన్‌ఫెక్టియస్‌ డిసీజస్ కు చెందిన బృందం ఈ ఏడాది చేసిన పరిశోధనలో తేలింది. 

ఈ పరిశోధనలో భాగంగా నెదర్లాండ్స్‌కు  చెందిన ఉట్రెక్ట్‌ విశ్వవిద్యాలయం పరిశోధకుల బృందం కోవిడ్ సోకిన వారి ఇళ్లలోని పెంపుడు కుక్కలకు, పిల్లుల రక్త నమూనాలను,గొంతు నుంచి స్వాబ్‌ను సేకరించి పీసీఆర్‌, యాంటీబాడీ పరీక్షలను నిర్వహించగా అందులో 4.2శాతం పీసీఆర్‌ టెస్టులో పాజిటివ్ వచ్చింది. అదేవిధంగా 17.4శాతం రక్తంలోయాంటీబాడీలు కనిపించాయి.

ఈ విధంగా జంతువులలో కరోనా వ్యాప్తి చెంది నయం అయినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ క్రమంలోనే కరోనా సోకిన యజమానుల నుంచి జంతువులకు కరోనా వ్యాప్తి చెందుతుందని తెలియజేశారు. అదేవిధంగా ఆ జంతువులతో పాటు నివసించే మరిన్ని జంతువులకు పరీక్షలు నిర్వహించగా వాటికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాలేదు.అంటే జంతువుల నుంచి జంతువులకు కరోనా వ్యాప్తి చెందదు కేవలం మనుషుల నుంచే జంతువులకు కరోనా వ్యాప్తి చెందుతుందని ఈ పరిశోధన ద్వారా శాస్త్రవేత్తలు వెల్లడించారు.కనుక కరోనా బారిన పడిన వారు పెంపుడు జంతువులకు కూడ దూరంగా ఉండాలని ఈ సందర్భంగా నిపుణులు తెలియజేశారు.