రేపటి నుంచి శ్రావణ మాసం.. మొదటి సోమవారం ఇలా పూజలు చేయండి.. !

శ్రావణ మాసం అనేది తెలుగు సంవత్సరంలో ఐదవ నెలలో వస్తుంది. శ్రవణం నక్షత్రంతో చంద్రుడు కలవడంతో ఈ నెలను శ్రావణ మాస నెల అంటారు. పురాణాల ప్రకారం ఈ శ్రావణ మాసం అనేది అత్యంత పవిత్రమైనదిగా చెబుతుంటారు. శివున్ని సోమవారం రోజున పూజిస్తే ఎంతో పుణ్యమని పెద్దలు అంటుంటారు. మిగతా తెలుగు నెలలకూ శ్రావణమాసానికీ చాలా తేడా ఉంది. శ్రావణమాసం ఎంతో ప్రత్యేకమైనది, విశిష్టమైనది, అత్యంత ముఖ్యమైనది.

రేపటి నుంచి అంటే (ఆగస్టు 9) నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. మొదటగానే శ్రావణ సోమవారం వచ్చింది. దీంతో రేపు శివుడికి ఎక్కువ పూజలు చేస్తారు. అంతేకాకుండా ఉపవాసం కూడా ఉంటారు. శ్రావణ సోమవారంరోజున శివలింగానికి చెరకు రసంతో పూజ చేస్తే.. ఆర్ధిక కష్టాలు తొలగుతాయి.

సంతానం లేనివారు శివలింగాన్ని పాలతో అభిషేకం చేయాలి. పేదవారికి దానధర్మం చేస్తే సంతాన భాగ్యం కలుగుతుందని శివ పురాణం చెబుతుంది. ఈ నెలంతా మహిళలు రకరకాల పూజలు, నోములు, వ్రతాలు చేస్తారు. ఉపవాస దీక్షలు చేస్తూ లక్ష్మీదేవి అమ్మవారికి రోజూ నైవేద్యం సమర్పిస్తూ… పూజలు చేస్తారు. శ్రావణ సోమవారం రోజున పాలు , పంచదార కలిసి అభిషేకం చేస్తే సుఖ సంతోషాలతో జీవిస్తారట. చాలా మంది ఈ నెలంతా మాంసం తినరు.

భక్తిశ్రద్ధలతో ఇష్టదైవాన్ని కొలుచుకుంటారు. ఈ నెలలో చేపలు కూడా ముట్టరు. ఇందుకు ఓ సైంటిఫిక్ కారణం కూడా ఉంది. సంవత్సర కాలంలో… ఈ నెలలోనే చేపలు ఎక్కువగా సంతానాన్ని వృద్ధి చేసుకుంటాయి. అందువల్ల వాటిని ముట్టుకోకుండా ఉంటే… మత్య్స సంపద పెరుగుతుంది. తద్వారా సంవత్సరమంతా చేపలు లభించేందుకు వీలవుతుంది.