ఆగకుండా ఎక్కిళ్ళు వస్తున్నాయా.. పరిష్కార మార్గం ఇదే?

సాధారణంగా అందరికీ ఎక్కిళ్లు రావడం సర్వసాధారణమే. అయితే కొందరిలో ఒక సారి ఎక్కిళ్లు వచ్చాయంటే ఎంతసేపటికి ఆగిపోవు. ఈ విధంగా ఆగకుండా ఎక్కిళ్ళు రావడంతో ఎంతో ఇబ్బంది పడుతుంటారు. ఎక్కిళ్ళు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎంతసేపటికి ఆగిపోవు. అలాంటి వారి కోసమే టెక్సాస్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఒక కొత్త పరికరాన్ని కనిపెట్టారు.

సాధారణంగా మనలో ఎక్కిళ్లు రావడానికి గల కారణం ఏమిటంటే ఫ్రెనిక్‌, వేగ‌స్ నాడులు బిగుసుకు పోవ‌డం వ‌ల్ల ఊపిరితిత్తులలో అడుగున ఉన్నటువంటి డయాఫ్రమ్ కండరం సంకోచిస్తుంది. దీని ఫలితంగా స్వరపేటిక పైన ఉన్నటువంటి ఎపిగ్లాసిటిస్ మూసుకుపోతుంది. అప్పుడు లోప‌లి నుంచి వచ్చే గాలి స్వరపేటికకు తగిలి మనకు ఎక్కిళ్లు వస్తాయి. ఈ విధమైనటువంటి ఎక్కిళ్ళను తగ్గించడం కోసం టెక్సాస్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఎల్ ఆకారంలో ఉన్నటువంటి ఒక పరికరాన్ని కనుగొన్నారు.

ఈ పరికరానికి టెక్సాస్ పరిశోధకులు ఫోర్స్‌డ్ ఇన్‌స్పిరేట‌రీ స‌క్ష‌న్ అండ్ స్వాలో టూల్ అని పేరు పెట్టారు. చిన్న ట్యూబ్‌లా ఉండే ఈ స్ట్రా అడుగున రెండు వేర్వేరు సైజుల్లో రంధ్రాలు ఉంటాయి. చిన్న పిల్లలలో ఎక్కిళ్ళు వచ్చినప్పుడు మార్చుకోవడానికి అనుగుణంగా వేర్వేరు సైజుల్లో రంద్రాలు ఉంటాయి. ఎల్ ఆకారంలో ఉన్నటువంటి ఈ పరికరాన్ని ఒక గ్లాసు నీటిలో వేసి ఎక్కిళ్ళు వస్తున్నప్పుడు గట్టిగా నీటిని పీల్చడం వల్ల నీరు బలంగా లోపలికి వెళ్లటం వల్ల ఫ్రెనిక్‌, వేగ‌స్ నాడులు స్పందించి డయాఫ్రమ్ యధాస్థితికి వస్తుంది. దీంతో వెక్కిళ్లు వెంటనే ఆగిపోతాయనీ.పరిశోధకులు చేసిన ఈ పరిశోధనలో సుమారు 92 శాతం మందికి తొందరగా ఎక్కిళ్ళు ఆగిపోయినట్లు తెలియజేశారు.