Tag Archives: 5 core jobs

కేంద్రం సంచలన నిర్ణయం.. 5 కోట్ల ఉద్యోగాలకు ప్రణాళిక..?

కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల దేశంలో కోట్ల సంఖ్యలో ఉద్యోగులు ఉద్యోగాపు కోల్పోయి ఇంటికే పరిమితమయ్యారు. ఈ రంగం, ఆ రంగం అనే తేడాల్లేకుండా అన్ని రంగాలపై వైరస్ ప్రభావం పడింది. దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొనేంత వరకు కొత్తగా ఉద్యోగాల్లో చేరాలనుకునే వాళ్లకు సైతం ఇబ్బందులు తప్పవు. అయితే నిరుద్యోగులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.
దేశంలో ఏకంగా 5 కోట్ల ఉద్యోగాలను కల్పించడానికి ప్రణాళిక సిద్ధంచేసింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల ద్వారా ఈ ఉద్యోగాలను కల్పించనున్నట్టు తెలిపారు. భారతదేశం మరో ఏడాదిలో అతిపెద్ద ఆటోమొబైల్ తయారీ కేంద్రంగా మారుతుందని వెల్లడించారు. భారత్ లో చైనాతో పోల్చి చూస్తే అన్ని విధాలుగా శక్తి సామర్థ్యాలు ఉన్నాయని పేర్కొన్నారు.

మన దేశంలో ముడి పదార్థాల లభ్యతతో పాటు నైపుణ్యం ఉన్న యువత ఎక్కువ సంఖ్యలో ఉన్నారని వెల్లడించారు. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలను 30 నుంచి 40 శాతం పెంచేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల ఎగుమతులను 48 నుంచి 60 శాతం పెంచనున్నట్టు వెల్లడించారు. 2020 హొరాసిస్ ఆసియా వర్చువల్ మీటింగ్ లో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు.

ప్రపంచ దేశాల వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు ఈ వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు. వివిధ దేశాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరై పలు విషయాల్లో సాయం చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.