Tag Archives: aadhaar seva kendras

ఆధార్ అప్ డేట్ చేసుకోవాలా.. అయితే ఇలా చేయండి..!

పాఠశాలలు తెరుచుకుంటుండటంతో ఆధార్ సేవా కేంద్రాల వద్ద రద్దీ పెరుగుతోంది. తమ పిల్లల ఆధార్ వివరాలను అప్ డేట్ చేయించడానికి తల్లిదండ్రులు ఆధార్ సెంటర్ల దగ్గర క్యూకడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అమ్మఒడి లాంటి పథకాలను పొందాలంటే కేవైసీ అప్ డేట్ తప్పనిసరి. ఇలా చాలా రోజుల తర్వాత స్కూళ్లు తెరుస్తుండటంతో తమ పిల్లల పేరు, వయస్సు, అడ్రస్, ఇతర వివరాలను అప్‌డేట్ చేయించడానికి ఆధార్ సెంటర్లకు వెళ్తున్నారు.

రేషన్ కార్డుదారులు తమ ఆధార్ వివరాలను అప్ డేట్ చేసుకోవడానికి కూడా ఆధార్ సెంటర్లకు వెళ్తున్నారు. అయితే ప్రతీ విషయానికి ఆధార్ సెంటర్ కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంటివద్ద కూడా కొన్ని సేవలను పొందొచ్చు. ఒకవేళ తప్పనిసరిగా ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాలనుకుంటే స్లాట్ బుక్ చేయాల్సి ఉంటుంది. అధికారిక వెబ్ సైట్ కి వెళ్లి స్లాట్ ను బుక్ చేసుకోవచ్చు.

ఆధార్ సేవా కేంద్రాల్లో ఐదేళ్ల లోపు ఉన్నవారికి బయోమెట్రిక్ అనేది రికార్డు చేయరు. వారు 5 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు వస్తున్నప్పుడు ఆధార్ సేవా సెంటర్ కి వెళ్లి బయోమెట్రిక్ అప్ డేట్ చేయించవచ్చు. మళ్లీ 15 ఏళ్లు దాటిన తర్వాత ఓసారి బయోమెట్రిక్స్ అప్‌డేట్ చేయాలి. ఈ సేవలు పొందాలంటే తప్పనిసరిగా ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సిందే.

పిల్లలకు మాత్రం ఈ సేవలు అన్నీ ఉచితంగానే లభిస్తాయి. ఒకవేళ ఇప్పటికే బయోమెట్రిక్ అప్ డేట్ అయి ఉంటే.. మొబైల్ నంబర్, అడ్రస్ మార్చేందుకు ఆధార్ సెంటర్ కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లోనే సేవలు పొందొచ్చు. దానికి గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎం ఆధార్ యాప్ డౌన్ లోడ్ చేసుకొని అందులో 35 సేవల్ని పొందొచ్చు.