Tag Archives: amithabh bachan

ఒకే బాణి గల పాటకు చిందులేసిన అమితాబ్, ఎన్టీఆర్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలా ఆడాయో తెలుసా.?!

1970 ద్వితీయార్థంలో జి.పి.సిప్పి నిర్మాణ సారధ్యంలో రమేష్ సిప్పి దర్శకత్వంలో “షోలే” చిత్రం విడుదలైంది. ఇందులో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర పోటీపడి నటించి షోలే చిత్రాన్ని విజయవంతం చేశారు. ఈ చిత్రంతో అమితాబచ్చన్ కు తిరుగులేని స్టార్డం వచ్చింది. ఇక అమితాబచ్చన్ వెనుతిరిగి చూసుకోలేదు. అందుకే ఆయన ఇండియన్ సూపర్ స్టార్ అయ్యారు.

ఆ క్రమంలో 1978 నారీమన్ ఇరానీ నిర్మాణం, చంద్రబరోత్ దర్శకత్వంలో “డాన్” చిత్రం విడుదలయ్యింది. ఇందులో అమితాబచ్చన్, జీనత్ అమన్ హీరో, హీరోయిన్లుగా నటించారు. సలీమ్ జావేద్ అందించిన ఈ సినిమా కథలో అమితాబచ్చన్ ద్విపాత్రాభినయం చేశారు. 1978 చిత్రాల్లో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా డాన్ చిత్రం ఒకటిగా ఉంటుంది.

కళ్యాణ్ జీ ఆనంద్ జీ సంగీత సారధ్యంలో వచ్చిన “కైకే పాను బనారస్ వాలా.. అనే పాట గాయకుడు కిషోర్ కుమార్ గొంతులోంచి భారతదేశమంతటా వ్యాపించింది. ఆ రోజుల్లో ఈ పాటకు చిందులేయని ప్రేక్షకుడంటూ లేరేమో అనిపిస్తుంది. దేశమంతట ఓ ఊపు ఊపిన టాప్ టెన్ పాటల్లో ఈ పాట ఒకటిగా ఉండడం గమనార్హం. ఈ పాట ఆలపించిన కిషోర్ కుమార్ కి ఉత్తమ గాయకుడిగా అవార్డు వచ్చింది. భాష ఏదైనా ఒక విజయవంతమైన చిత్రాన్ని మరొక భాషలోకి రీమేక్ చేయడం ఆనాటి నుంచి వస్తున్న సంప్రదాయం అనే చెప్పవచ్చు.

ఆ క్రమంలో డాన్ చిత్రాన్ని మొట్టమొదటగా ఎన్టీఆర్ హీరోగా తెలుగులో రూపొందించడం జరిగింది. అలా 1979 శ్రీ గజలక్ష్మి ఆర్ట్స్, విద్యాసాగర్ నిర్మాణం, కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో “యుగంధర్” చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమాలో నందమూరి తారక రామారావు, జయసుధ హీరో, హీరోయిన్లుగా నటించారు. డాన్ చిత్రాన్ని ఆధారంగా చేసుకొని నిర్మించినప్పటికీ.. అంతకుముందే విడుదలైన హిందీ చిత్రం “చైనా టౌన్” ఆధారంగా తెలుగులో నిర్మించబడిన “భలే తమ్ముడు” చిత్ర కథకు యుగంధర్ సినిమా దగ్గరగా ఉంటుంది.

ఇకపోతే ఎన్టీఆర్, ఇళయరాజా కాంబినేషన్ లో వచ్చిన ఒకే ఒక చిత్రం యుగంధర్ గా పేర్కొనవచ్చు. ఎన్టీఆర్ ఒకే చిత్రానికి సంగీత సారథ్యం వహించిన ఇళయరాజా హిందీలో బహుళ జనాదరణ పొందిన “కైకే భానారస్ వాలా.. అనే పాట బాణిని తీసుకొని.. “ఒరబ్బా వేసుకున్న కిల్లి… ఒరే.. ఒరే..ఒళ్ళంత తిరిగెను మళ్ళీ.. మత్తుగా ఉందిరా ఓ బేటా.. ఆ నిజమే చెబుతా ఈ పూట.. అనే పాట ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం గొంతునుంచి జాలువారింది. ఈ పాటకు ఆంధ్రదేశమంతటా అన్నగారి అభిమానులే కాకుండా ప్రేక్షకులందరూ కాలు కదిపారనడంలో సందేహం లేదు.

సంవత్సరం తేడాతో వచ్చిన ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయఢంకా మోగించాయి. ఆ తర్వాత హిందీ డాన్ చిత్రం ఆధారంగా తమిళంలో రజనీకాంత్, సుప్రియ హీరో, హీరోయిన్లుగా “బిల్లా” (1980) చిత్రం రూపొందించబడింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో రజినీకాంత్ ఒక్కసారిగా టాప్ స్టార్ గా ఎదిగిపోయారు. ఆ తర్వాత డాన్ చిత్రం ఇతర దక్షిణాది భాషల్లోకి కూడా అనువదించబడింది.