Tag Archives: ayush officials

ఆనందయ్య మందు పంపిణీ ఇప్పట్లో లేనట్లే.. ఎందుకంటే?

ప్రస్తుతం భారతదేశంలో నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందు హాట్ టాపిక్ గా మారింది. గత కొద్ది రోజుల నుంచి ఆనందయ్య ఆయుర్వేద మందు ఎంతో ప్రాచుర్యం పొందుతోంది. ఇతని దగ్గర మందు తీసుకున్నవారి ఆరోగ్యం నిమిషాలలో కుదుటపడుతుందని, ఈ మందు ద్వారా ఎంతో మంది తమ ప్రాణాలను దక్కించుకున్నారని గత కొద్ది రోజుల నుంచి పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఆనందయ్య తయారు చేస్తున్న ఆయుర్వేద మందు కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఆయుర్వేద మందు పై ప్రభుత్వం నిషేధం విధించి ఈ మందు పై CCRAS (సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్) అధ్యయనం చేపట్టాలని సూచించింది. అయితే ఏ అధ్యయనానికి ఎన్నో అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఈ అధ్యయనంలో భాగంగా అధికారులు ఇప్పటి వరకు ఆనందయ్య దగ్గర ఎంతమంది మందు తీసుకున్నారు, ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి ఏవిధంగా ఉందో అనే విషయం గురించి ఆరా తీస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆనందయ్య దగ్గర మందు తీసుకున్న బాధితులకు సోమవారం నుంచి ఫోన్ కాల్స్ చేస్తున్న నేపథ్యంలో 92 మందికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదు, అదేవిధంగా 42 మంది గ్రామస్తులు ఆనందయ్య వద్ద మందు తీసుకోలేదని చెబుతున్నారు. అయితే ఆనందయ్య దగ్గర మందు కోసం వచ్చిన వారు వచ్చినట్టుగా మందు తీసుకు వెళ్తున్నారని, ఎవరు కూడా అతనికి ఫోన్ నెంబర్ లేదా ఇతర వివరాలను కానీ తెలుపలేదని అధికారులు తెలియజేస్తున్నారు.

ఈ విధంగా ఆనందయ్య దగ్గర మందు తీసుకున్న బాధితుల వివరాలు తెలియకపోతే ఈ అధ్యయనం ఏ విధంగా చేయాలని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వివరాలు తెలిస్తే తప్ప నివేదిక తయారు చేయలేమని అధికారులు తెలియజేశారు. ఇటువంటి సమయంలో ఆనందయ్య మందు పై అధ్యయనం చేయడం మరింత ఆలస్యం కావచ్చని, ఈ మందు ఇప్పట్లో పంపిణీ అయ్యే అవకాశాలు కూడా కనిపించడం లేదని తెలుస్తోంది. ఆనందయ్య దగ్గర మందు తీసుకున్న వారి వివరాలు తెలిస్తే కానీ నివేదిక ఇవ్వలేరు,నివేదిక ఇవ్వకపోతే ప్రభుత్వం ఈ మందు సరఫరాకు అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది.