Tag Archives: Boat capsizes

భారీ వర్షాల కారణంగా.. మునిగిన 12 పడవలు.. 11 మంది గల్లంతు..!

దక్షిణ గుజరాత్‌లో వాతావరణంలో అకస్మాత్తుగా మారిపోయింది. దీంతో పలు నగరాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. అదే సమయంలో.. గిర్-సోమ్‌నాథ్ సమీపంలోని అరేబియా సముద్రంలో బలమైన గాలులు తలెత్తాయి. 12 మత్స్యకారులకు సంబంధించి పడవలు మునిగిపోయాయి. ఈ పడవల్లో 23 మంది మత్స్యకారులు ఉండగా.. వారిలో 11 మంది గల్లంతయ్యారు.

మత్స్యకారుల జాడ కోసం అధికారులు నేవీ సహాయం తీసుకున్నారు. అదే సమయంలో రెండు ఆర్మీ హెలికాప్టర్లను కూడా ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా.. ఒక రోజు ముందుగానే మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ కల్లోల ప్రభావంతో దక్షిణ గుజరాత్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

అంతే కాకుండా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు. సముద్రంలో ఎక్కువ దూరం చేపలు పట్టడానికి వెళ్లే మత్స్యకారులను ముఖ్యంగా హెచ్చరించారు. అయితే వాళ్లు చెప్పిన విధంగానే ఎక్కువ దూరం చేపలు పట్టేందుకు వెళ్లిన మత్స్యకారులు తమ పడవలు తీసుకొని తిరుగు ప్రయాణం అయ్యారు. కానీ 12 పడవలు మాత్రం ముందుగానే ఒడ్డుకు చేరుకోలే పోయారు.

దీంతో ఎవరూ ఊహించని విధంగా అలలు ఎక్కువగా కావడంతో.. వాళ్లు ఆ అలల్లో చిక్కుకుపోయారు. వాళ్ల జాడ కోసం అధికారులు విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. దక్షిణ గుజరాత్ లో వర్షం కారణంగా ఒకే రోజులో మూడు డిగ్రీల ఉష్ణోగ్రత పడిపోయింది. డయ్యూలో కూడా బలమైన గాలులతో కూడిన భారీ వర్షాల కారణంగా అక్కడ ఓ పడవ మునిగిపోవడంతో ఒక మత్స్యకారుడు మరణించాడు.