Tag Archives: completed five years

సీఎం జగన్ సంచలన నిర్ణయం.. ఏపీలో ఆ ఖైదీలంతా విడుదల..?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో జైలు శిక్ష అనుభవిస్తున్న మహిళా ఖైదీలకు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో ఐదు సంవత్సరాల జైలు శిక్ష పూర్తైన మహిళా ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయించారు. జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మహిళా ఖైదీలు, వాళ్ల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వాల పాలనకు భిన్నంగా సీఎం జగన్ నిర్ణయాలు తీసుకుంటూ ఉండటం గమనార్హం.

నిన్న ఏపీ హోం మంత్రి సుచరిత మీడియాలో మాట్లాడుతూ మహిళా ఖైదీల విడుదల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ తీసుకున్న నిర్ణయం గొప్ప నిర్ణయమని.. దేశ చరిత్రలోనే గతంలో ఎవరూ తీసుకోని నిర్ణయాన్ని జగన్ తీసుకున్నారని చెప్పారు. జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 55 మంది మహిళా ఖైదీలు విడుదల కానున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 147 మంది మహిళా ఖైదీలు జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

పోలీసులు జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు వివిధ వృత్తులపై శిక్షణ ఇచ్చారు. ఖైదీలు జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో వారి కాళ్లపై వారు నిలిచే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో ఇంతమంది మహిళా ఖైదీల విడుదల జరుగుతోందని వెల్లడించారు. విడుదలైన ఖైదీలు కుటుంబాలతో సంతోషకరమైన జీవనం సాగిస్తాయని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.

నేరాల్లో మహిళల పాత్ర గురించి కూడా విచారణ జరిపిస్తున్నామని తెలిపారు. చాలామంది క్షణికావేశంలో నేరాలు చేసి ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రాబొయే ఏడు రోజుల్లో మహిళా ఖైదీల విడుదల జరగనుందని చెప్పారు.