Tag Archives: crores of money

ఏపీ నిరుద్యోగులకు అలర్ట్.. లక్షల్లో మోసపోయిన 220 మంది..?

దేశంలో సంవత్సరం సంవత్సరానికి నిరుద్యోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అదే సమయంలో ఉద్యోగాలు కల్పిస్తామని పలు కంపెనీలు, కన్సల్టెన్సీ సంస్థలు, ముఠాలు చేస్తున్న మోసాలు ప్రతిరోజూ పదుల సంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలో 220 మంది నిరుద్యోగులు మోసపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లాలోని తెనాలిలో కోఆపరేటివ్‌ సొసైటీ పేరుతో బ్యాంక్ ప్రారంభిస్తామనిఒక ముఠా మోసాలకు పాల్పడింది.

ఈ ముఠా ఒక్కో నిరుద్యోగి నుంచి లక్షల్లో వసూలు చేసి కోట్ల రూపాయలకు ఎగనామం పెట్టిందని సమాచారం. ఉద్యోగాల కోసం ఎదురు చూసిన బాధితులు మోసపోయామని గ్రహించి గుంటూరు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఎస్పీ విశాల్ ఇప్పటికే అధికారులను ఈ కేసు గురించి దర్యాప్తు చేయమని ఆదేశాలు జారీ చేశారు. లక్షల్లో మోసపోయిన నిరుద్యోగులు తమ డబ్బును వెనక్కు ఇప్పించాలని పోలీసులను కోరుతున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే పది మంది సభ్యులు గ్రూపుగా ఏర్పడి తాము త్వరలో కోఆపరేటివ్‌ సొసైటీ పేరుతో బ్యాంకును ప్రారంభిస్తామని ప్రచారం చేసుకున్నారు. ఏపీ, తెలంగాణ నిరుద్యోగులకు ఈ బ్యాంకులో ఉపాధి కల్పిస్తామని పెద్దఎత్తున ప్రచారం చేశారు. బ్యాంక్‌ మేనేజర్‌, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల పేర్లతో 8 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు నిరుద్యోగుల నుంచి ఈ ముఠా వసూలు చేసింది.

రాష్ట్రంలో గుంటూరులోని తెనాలితో పాటు 20 బ్రాంచిలను ఏర్పాటు చేశామని చెప్పి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇవ్వడంతో డబ్బులు చెల్లించి మోసపోయామని నిరుద్యోగులు చెబుతున్నారు. డబ్బు వెనక్కు ఇవ్వాలని కోరితే చంపేస్తామని బెదిరింపులకు పాల్పడటంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని నిరుద్యోగులు తెలిపారు.