Tag Archives: Gandhi Jayanti

పేదలకు జగన్ సర్కార్ శుభవార్త.. ఇళ్ల పట్టాల పంపిణీ ఎప్పుడంటే..?

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రాష్ట్రంలోని ఇళ్లు లేని పేద ప్రజలకు శుభవార్త చెప్పింది. పేద ప్రజలు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రభుత్వం డేట్ ఫిక్స్ చేసింది. డిసెంబర్ నెల 25వ తేదీన రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే అనేకసార్లు ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా పడగా ఈసారి ఖచ్చితంగా అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

కోర్టులో ఇళ్ల పట్టాల పంపిణీ గురించి పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో ప్రభుత్వం కోర్టు స్టే ఉన్న ప్రాంతాలు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఇళ్ల పట్టాల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేడు స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ సమావేశం నిర్వహించారు. జగన్ ఈ సమావేశంలో లబ్ధిదారులకు డి ఫామ్ పట్టా ఇచ్చి ఇళ్లస్థలాలను కేటాయించాలని చెప్పారు. రాష్ట్రంలో పట్టాలు ఇచ్చిన రోజే ఇళ్ల నిర్మాణం కూడా మొదలు కానుంది.

ప్రభుత్వం దాదాపు 30 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనుండగా తొలి దశలో 15 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనుంది. జగన్ సర్కార్ మొదట మార్చి 25వ తేదీన ఉగాది పండుగ సందర్భంగా ఇళ్ల పట్టాల పంపిణీ అమలు చేయాలని భావించింది. అయితే అప్పుడు స్థానిక సంస్థల నోటిఫికేషన్ వల్ల ఎన్నికల కోడ్ అమలు కావడంతో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. ఆ తరువాత అంబేద్కర్ జయంతి, వైఎస్సార్ జయంతి, స్వాతంత్ర దినోత్సం, గాంధీ జయంతి సందర్భంగా ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలని ప్రభుత్వం భావించింది.

ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు ప్రశంసిస్తున్నారు. జగన్ సర్కార్ సొంతింటి కలను నెరవేర్చే దిశగా అడుగులు వేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు స్టే ఉన్న ప్రాంతాల్లో కోర్టు తుది తీర్పుకు అనుగుణంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరగనుంది.