Tag Archives: government hospital

అంత్యక్రియలయ్యాయి.. ఆమె తిరిగొచ్చేసింది..!

ఎవరైనా మన బంధువుల లో చనిపోయారు అని తెలిస్తే వారికి అంత్యక్రియలు నిర్వహించడం సర్వసాధారణమే. అయితే ప్రస్తుతం కరోనా నేపథ్యంలో అంత్యక్రియలకు కూడా ఎవరూ హాజరు కాకూడదని నిబంధన ఉండటంతో సమీప బంధువులు చనిపోయినప్పటికీ బంధువులు వెళ్లడం లేదు. ఈ క్రమంలోనే కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే వారి అంత్యక్రియలలో పాల్గొంటున్నారు. ఈ విధంగా కరోన బారినపడి చనిపోయిందని తనకు అంత్యక్రియలు నిర్వహించారు. కానీ పెద్దకర్మ చేస్తుండగా సాక్షాత్తు చనిపోయిన మనిషి ఆటోలో దిగిరావడం చూసి అక్కడున్న వారంతా ఒక్క నిమిషం భయభ్రాంతులకు లోనైన ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట క్రిస్టియన్‌పేటకు చెందిన ముత్యాల గిరిజమ్మ కూరగాయల వ్యాపారం చేసేది. ఆమె భర్త ముత్యాల గడ్డయ్య కొలిమి పనిచేసేవాడు. అతడు మానసికంగా ఎంతో అమాయకంగా ఉంటాడు. ఈ దంపతులకు దావీద్ అనే కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలోనే గత నెల 12వ తేదీన గిరిజ కరోనా బారినపడి విజయవాడ ఆస్పత్రిలో చేరింది. ఈ క్రమంలోనే తన కొడుకు కూడా కరోనా బారిన పడటంతో అతను హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈ క్రమంలోనే మే 15న గిరిజమ్మ చనిపోయిందని ఆస్పత్రి యాజమాన్యం ఒక మృతదేహాన్ని గిరిజమ్మ భర్తకు అప్పగించారు. గిరిజమ్మ కరోనాతో మృతి చెందిందని భావించి బంధువులు ఎవరు ఆమెను చూడటానికి సాహసం చేయలేదు. ఈ క్రమంలోనే ఆమె భర్త గడ్డయ్య ఆమెకు అంత్యక్రియలు నిర్వహించాడు. అదే విధంగా ఆమె కొడుకు దావీద్ కూడా కరోనాతో మృతి చెందాడు.

ఈ విధంగా తల్లి కొడుకులకు ఇద్దరికీ అంత్యక్రియలు నిర్వహించి ఇద్దరికీ పెద్దకర్మ చేసే రోజు గిరిజమ్మ ఎంతో ఆరోగ్యంగా ఆటోలో ఇంటికి చేరుకుంది. ఒక్కసారిగా ఆమెను చూడగానే అక్కడున్న వారు ఎంతో భయాందోళన చెందారు. తరువాత ఈ షాక్ నుంచి తేరుకొని ఆమెను వివరంగా అడగగా అసలు విషయం బయటపడింది. తనని ఆసుపత్రి సిబ్బంది ఎంతో బాగా చూసుకున్నారని,తనకిప్పుడు కరోనా లేకపోవడం వల్లే ఆస్పత్రి సిబ్బంది తనకి ఆటోలో ఇక్కడికి పంపించారని విషయం తెలిపింది.

మే 12వ తేదీన ఆస్పత్రికి చేరిన గిరిజమ్మకి మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి యాజమాన్యం ఆమెకు వేరేచోటికి మార్చారు. ఈ క్రమంలోనే అతని భర్త వెళ్లి ఆమెని వివరాలు అడగగా అక్కడ డ్యూటీలో ఉన్న సిబ్బంది చనిపోయిందని మార్చురీకి వెళ్లి 60 సంవత్సరాల వయసు కలిగిన మహిళ మృతదేహం చూపించగా మానసిక పరిస్థితి బాగా లేని గడ్డ తన భార్య మృతదేహమేనని తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఆమె కరోనా బారినపడి ఇప్పుడిప్పుడే కోలుకోవడంతో ఆమెకు తన కొడుకు దావీద్ మరణించిన విషయాన్ని తెలియజేయలేదు.