Tag Archives: Hyderabad man duped of Rs 6.5 lakh

గూగుల్ సెర్చ్ చేసాడు…రూ.6.5 లక్షలు పోగొట్టుకున్నాడు.. ఎలాగంటే?

రోజురోజుకు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఎంతో మంది అమాయక ప్రజలను బురిడీ కొట్టించి లక్షలకు లక్షలు డబ్బును దోచుకుంటున్నారు.ఇప్పటివరకు ఈ విధంగా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన ఎందరినో చూసాము. చాలామంది ఈ సైబర్ నేరగాళ్ల వలలో పడుతూ లక్షలకు లక్షలు డబ్బులను పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి నుంచి ఏకంగా రూ.6.5 లక్షలు దోచుకున్న ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

నగరంలోని లోతుకుంటకు చెందిన పశుపతి అనే వ్యక్తి ఆన్ లైన్ ద్వారా ఆయుర్వేద ఉత్పత్తులను కొనుగోలు చేశాడు. అయితే ఆ ప్రొడక్ట్స్ అతనికి డెలివరీ అయ్యాయి. అయితే ఆ ఉత్పత్తులు తనకు నచ్చకపోవడంతో తిరిగి వాటిని రిటన్ చేయాలని భావించాడు. ఈ క్రమంలోనే కస్టమర్ కేర్ నెంబర్ కోసం గూగుల్లో సెర్చ్ చేశాడు.

ఈ విధంగా గూగుల్ సెర్చ్ చేస్తున్న క్రమంలో ఆ వ్యక్తికి ఫోన్ వచ్చింది. అవతలి నుంచి ఓ వ్యక్తి మాట్లాడుతూ… మీ డబ్బులు వాపసు ఇస్తానని చెప్పాడు. అందుకోసం ఒక లింక్ మీ మొబైల్ కి పంపిస్తాను దాని ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పాడు. సదరు వ్యక్తి చెప్పిన విధంగానే పశుపతి ఎనీ డెస్క్ ఆప్ డౌన్లోడ్ చేసుకున్నాడు.ఈ యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత మరోసారి ఆ వ్యక్తి ఫోన్ చేసి పశుపతి క్రెడిట్, డెబిట్ కార్డు నెంబర్లు తీసుకొని త్వరలోనే మీ డబ్బులు మీ అకౌంట్లో క్రెడిట్ అవుతాయని చెప్పారు.

ఈ విధంగా అవతలి వ్యక్తి ఫోన్ మాట్లాడి పెట్టేసిన కొన్ని నిమిషాలకే పశుపతి 2 ఖాతాల నుంచి ఏకంగా రూ.6.5లక్షల రూపాయలు డెబిట్ అయినట్లు మెసేజ్ రావడంతో వెంటనే అవతలి వ్యక్తికి ఫోన్ చేశాడు.అప్పటికే అతని ఫోన్ స్విచాఫ్ రావడంతో తాను మోసపోయానని గ్రహించిన పశుపతి వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఇలాంటి సైబర్ నేరగాళ్ల పట్ల ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసులు పదేపదే చెబుతున్నప్పటికీ ఇలాంటి సంఘటనలు ఎదురవుతూనే ఉన్నాయని పోలీసులు ఈ సందర్భంగా తెలియజేశారు.