Tag Archives: irctc announces

రైలు ప్రయాణికులకు అలర్ట్.. టికెట్ బుకింగ్ లో కీలక మార్పులు..?

మనలో చాలామంది ఎక్కువగా రైలు ప్రయాణాన్ని ఇష్టపడతారు. ఎక్కువ దూరం ప్రయాణం చేయడానికి బస్సు, కారు, ఇతర వాహనాలతో పోలిస్తే రైళ్లు ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయి. ఐఆర్సీటీసీ ప్రయాణికుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు నిబంధనల్లో మార్పులు చేస్తూ ప్రయాణికులకు ప్రయోజనం చేకూరేలా చేస్తోంది. రైలు ప్రయాణికులు ఇకపై రైలు బయలుదేరే కొన్ని నిమిషాల ముందు కూడా టికెట్ ను బుక్ చేసుకోవచ్చు.

తాజాగా రైల్వే శాఖ కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. రైల్వే శాఖ ప్రీకోవిడ్ సిస్టమ్ ను మళ్లీ అమలులోకి తీసుకొస్తూ ఉండటం గమనార్హం. ఇప్పటివరకు రైలు బయలుదేరే రెండు గంటల ముందు చార్ట్ ను ప్రిపేర్ చేయగా ప్రస్తుతం రైలు బయలుదేరే 30 నిమిషాల ముందు కూడా చార్ట్ ప్రిపేర్ అవుతుంది. దేశంలో గతంలో పోలిస్తే నమోదవుతున్న కేసుల సంఖ్య, మరణాల సంఖ్య భారీగా తగ్గడంతో రైల్వే శాఖ మళ్లీ సెకండ్ రిజర్వేషన్ చార్ట్ ను అమలులోకి తెచ్చింది.

జోనల్ రైల్వేస్ సిఫార్సుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు వెల్లడించారు. రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో పరిమిత సంఖ్యలో రైళ్లు నడుస్తున్న తరుణంలో రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నారు. మరోవైపు రైలు సర్వీసులను పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తోంది.

ప్రస్తుతం పండగల కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. క్రమంగా రైళ్ల సర్వీసులను పెంచే దిశగా రైల్వే శాఖ అడుగులు వేస్తోంది. ఈ సంవత్సరం చివరినాటికి రైళ్ల సర్వీసులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.