Tag Archives: japan hits corona cases

కలవరపెడుతున్న కరోనా కేసులు.. వైరస్ బారిన పడుతున్న టోక్యో ఒలంపిక్ క్రీడాకారులు..!

టోక్యో ఒలంపిక్స్ 2020 లో జరగాల్సింది. అయితే కరోనా కారణంగా వాయిదాపడి 2021లో జరుగుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి నిర్వాహకులు.. ప్రభుత్వ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా.. టోక్యో సిటీలో మాత్రం కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఎప్పుడూ లేనంతగా కరోనా వైరస్ కొత్త కేసులు నమోదయ్యాయి.

ఇప్పటికే వేర్వేరు దేశాలకు చెందిన కొంతమంది క్రీడాకారులు కరోనా బారిన పడి.. పోటీ నుంచి తప్పుకున్నారు. టోక్యో హెల్త్ డిపార్ట్మెంట్ వెల్లడించిన హెల్త్ బులెటిన్ లో గత 24 గంటల్లో టోక్యోలో కొత్తగా 3,865 కేసులు నమోదయినట్లు వెల్లడించారు. టోక్యోలో ఇదే అత్యధికం. దీంతో టోక్యో అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. గత మూడురోజులుగా వరసగా మంగళ, బుధ, గురు వారాల్లో 9,890 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికార యంత్రాంగం తెలిపింది.

రెండుసార్లు వరల్డ్ ఛాంపియన్‌ అయిన కెండ్రిక్స్‌, కరోనా బారిన పడడంలో టోక్యో ఒలింపిక్స్ నుంచి తప్పుకున్నాడు. అయితే అతనితో కాంటాక్ట్ ఉన్న ఆస్ట్రేలియా అథ్లెట్ల టీమ్ మొత్తం ఐసోలేషన్‌కి వెళ్లాల్సి వచ్చింది. వీరందరికీ కరోనా పరీక్షలు నిర్వహించిన తర్వాతే విశ్వక్రీడల్లో పాల్గొంటారా? లేదా? అనే విషయంపై క్లారిటీ వస్తుంది. ఒలింపిక్స్‌లో కరోనా కేసులు పెరుగుతుండడంతో అథ్లెట్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. జూలై 23న మొదలైన విశ్వక్రీడలు.. ఆగస్టు 8 వరకూ జరగనున్నాయి.

అయితే ఈ రేంజ్‌లో కేసులు పెరుగుతూ పోతే, విశ్వక్రీడలను అర్ధాంతరంగా నిలిపివేసే అవకాశమూ ఉంది. మరోవైపు, టోక్యో ఒలింపిక్స్ విలేజ్‌లోకి ఎవ్వరినీ ప్రవేశించనివ్వట్లేదు. ఎందుకంటే అక్కడ కూడా కరోనా కేసులు విపరీతంగా నమోదు అవుతున్నాయి. టోక్యోలో 25 శాతం మేర కొత్త కేసులు నమోదైన ప్రతి ప్రాంతంలోనూ ఎమర్జెన్సీ విధించారు. కమిటీ అధికారికంగా నియమించుకున్న వాలంటీర్ల సంఖ్యను కూడా పరిమితం చేశారు అధికారులు. అంతే కాకుండా ఆసుపత్రిలో బెడ్ల సంఖ్య కూడా పెంచనున్నట్లు అధికారులు తెలిపారు.