Tag Archives: months

కరోనా విషయంలో మరో శుభవార్త.. యాంటీబాడీలు ఎన్ని నెలలు ఉంటాయంటే..?

ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు కరోనా మహమ్మారి గురించి వేర్వేరు పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనల ద్వారా కొత్త విషయాలను వెల్లడిస్తున్నారు. శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెలుగులోకి వస్తున్న విషయాలు ప్రజల్లో భయాందోళనకు తగ్గిస్తున్నాయి. తాజాగా శాస్త్రవేత్తలు కరోనా యాంటీబాడీల గురించి పరిశోధనలు చేసి కీలక ప్రకటన చేశారు. కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో ఏడు నెలలు యాంటీబాడీలు ఉంటాయని చెప్పారు.

పోర్చుగల్ శాస్త్రవేత్తలు కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారిపై పరిశోధనలు చేసి 90 శాతం మందిలో ఏడు నెలలు యాంటీబాడీలు ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. అయితే వయస్సుతో యాంటీబాడీలకు సంబంధం లేదని అందరిలోనూ ఒకే విధంగా యాంటీబాడీలు ఉన్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. యూరోపియన్‌ జర్నల్‌ ఆఫ్ ఇమ్యునాలజీలో ఈ విషయాలను వెల్లడించారు. ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ మాలిక్యులర్‌ పరిశోధకులు ఈ పరిశోధనలు చేశారు.

వైరస్‌ తీవ్రత ప్రభావాన్ని బట్టి యాంటీబాడీల ఉత్పత్తి జరుగుతోందని తాము గుర్తించామని పేర్కొన్నారు. ఏదైనా వైరస్ మన శరీరంలోకి ప్రవేశిస్తే ఇమ్యూనిటీ సిస్టమ్ యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుందని.. వైరస్ పై పోరాటానికి యాంటీబాడీలు దోహదపడతాయని పేర్కొన్నారు. 300 మంది బాధితులు, వైద్య సిబ్బంది, 200 కరోనా నుంచి కోలుకున్న వాలంటీర్లపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు.

కరోనా నుంచి కోలుకున్న మూడు వారాల తర్వాత యాంటీబాడీలు ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి అవుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. మహిళలతో పోలిస్తే పురుషుల్లోనే వేగంగా యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని వెల్లడించారు.