Tag Archives: mp delta plus death

మధ్యప్రదేశ్ లో డెల్టా ప్లస్ వేరియంట్ తొలి మరణం.. ఆందోళనలో అధికారులు?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా రెండవ దశ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో అధికారులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదు కావడంతో అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డెల్టా ప్లస్ వేరియంట్ థర్డ్ వేవ్ రూపంలో ముంచుకొస్తే రెండవ దశ కన్నా రెట్టింపు స్థాయిలో కేసులు నమోదు అవుతాయని అందుకే ప్రతి ఒక్కరు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించడం ముఖ్యమని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు 40 నమోదయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇదిలా ఉండగా దేశంలోనే డెల్టా ప్లస్ వేరియంట్ తొలి మరణం మధ్యప్రదేశ్ లో నమోదయిందని అధికారులు వెల్లడించారు. కోవిడ్ -19 తో మృతిచెందిన వ్యక్తి జన్యు నమూనాలను పరీక్షించగా అసలు విషయం బయట పడినట్లు అధికారులు వెల్లడించారు.

మధ్యప్రదేశ్ లో ఇప్పటి వరకు ఐదు డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఇందులో నలుగురు కోలుకోగా ఉజ్జయినికి చెందిన ఓ మహిళ మృత్యువాత పడినట్లు అధికారులు తెలియజేశారు. అయితే ఈ డెల్టా ప్లస్ వేరియంట్ నుంచి కోలుకున్న నలుగురు 2 డోసుల వ్యాక్సిన్ పూర్తిగా వేయించుకున్నారు. చనిపోయిన మహిళ ఒక డోస్ పూర్తి చేసుకున్నట్లు ఈ సందర్భంగా ఉజ్జయిని కోవిడ్ నోడల్ అధికారి డాక్టర్ రౌనక్ వెల్లడించారు.

కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన డెల్టా ప్లస్ వేరియంట్ థర్డ్ వేవ్ రూపంలో ముంచుకొస్తుందని, ఇది రెండవ దశ కంటే తీవ్రస్థాయిలో నష్టం కలిగిస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా జాగ్రత్తలను పాటిస్తూ, ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఉండాలని అధికారులు ఆదేశించారు.