Tag Archives: mundadugu movie

సామ్యవాద ముసుగులో మసాలా సినిమా.. అని ఆ రోజుల్లో ఈ బ్లాక్ బస్టర్ గురించి ఓ పత్రిక ఎందుకు రాయాల్సివచ్చింది.?!

స్వయంకృషితో వచ్చిన అతి కొద్ది మంది దర్శకుల్లో కె.బాపయ్య ఒకరు “ప్రేమ్ నగర్” చిత్రానికి కె.ఎస్. ప్రకాశరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన తర్వాత 1970లో ఎస్.వి.రంగారావు ప్రధాన పాత్రలో “ద్రోహి” అనే చిత్రానికి మొదటి సారిగా దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ఎన్టీరామారావుతో రూపొందించిన “ఎదురులేని మనిషి” చిత్రం డిసెంబర్ 12, 1975 న విడుదలై 6 సెంటర్ లలో వందరోజులు ఆడి మంచి విజయం సాధించడంతో కె.బాపయ్యకు మంచి పేరు వచ్చింది.

అదే సంవత్సరం శోభన్ బాబు తో తీసిన “సోగ్గాడు” చిత్రం డిసెంబర్ 19, 1975న విడుదలై 19 సెంటర్లలో వందరోజులు ఆడి సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా కె.బాపయ్యను మరింత ముందుకు తీసుకెళ్ళింది. ఆ క్రమంలో సురేష్ ప్రొడక్షన్స్ లో మరో అవకాశం వచ్చింది. డి.రామానాయుడు, కె.బాపయ్య మంచి కథ కోసం ఎదురు చూస్తున్న క్రమంలో.. అప్పటికే చలిచీమలు, సమాధి కడుతున్నాం చందాలివ్వండి, ఈ చరిత్ర ఏ సిరాతో లాంటి సామ్యవాద భావాలతో కూడిన చిత్రాలకు కథలు రాసి సాధారణ విజయాలతో ముందుకు వెళుతున్న పరుచూరి సోదరులను కలవడం జరిగింది.

1983 జనవరిలో సురేష్ ప్రొడక్షన్స్, కె.బాపయ్య దర్శకత్వంలో మల్టీస్టారర్ “ముందడుగు” చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో శోభన్ బాబు, కృష్ణ, జయప్రద, శ్రీదేవి హీరో హీరోయిన్లుగా నటించారు. మరో ప్రధాన పాత్రలలో గుమ్మడి వెంకటేశ్వరరావు, శివకృష్ణ అన్నదమ్ములుగా నటించారు. శివకృష్ణ ప్రజాస్వామ్య ఆలోచనలు, అభ్యుదయ భావాలు గల వ్యక్తి సమసమాజ స్థాపన ద్యేయంగా.. శివకృష్ణ తమ ఆస్తిని ప్రజలకు పంచుతాడు. పెట్టుబడిదారి విధానం ఆలోచనల గల రావుగోపాల్ రావు ఒక సంస్థను స్థాపిస్తారు. శోభన్ బాబు కోటీశ్వరుడుగా నటించగా.. హీరో కృష్ణ లారీడ్రైవర్ గా నటించారు.

ప్రజాస్వామ్య, సామ్యవాద కమ్యూనిజం సిద్ధాంతాల భావజాలం చుట్టూ కథ నడుస్తుంది. కమర్షియల్ హంగులు అద్దడంతో ఆ రోజుల్లో ఈ సినిమా ఒక బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అప్పట్లో ఈ చిత్రం ఎన్నో రికార్డులను తిరగరాసింది. ఇండస్ట్రీలో కృష్ణ సినిమాల్లో ఓక కోటి రూపాయిల గ్రాస్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. సినిమా విజయాన్ని పురస్కరించుకుని నిర్మాత డి.రామానాయుడు రజతోత్సవాన్ని చెన్నై “తాజ్ హోటల్” లో నిర్వహించారు. అయితే ఈ అద్భుత విజయాన్ని గురించి ఆ రోజుల్లో కొన్ని పత్రికలు కీర్తించాయి. ముఖ్యంగా సితార సినీ పత్రిక “ముందడుగు” చిత్రం గురించి సామ్యవాద భావాలు గల మసాలా చిత్రమని రాయడం సినీ పరిశ్రమలో అప్పట్లో చర్చనీయాంశమైంది.