Tag Archives: new rules from january

ఏపీ వాహనదారులకు షాకింగ్ న్యూస్.. జనవరి 1 నుంచి భారీ జరిమానాలు..?

జగన్ సర్కార్ కొన్ని రోజుల క్రితం రోడ్ సేఫ్టీ నిబంధనలు కఠినంగా అమలు చేసేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. 2021 సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఇకపై వాహనదారుల దగ్గర వాహనానికి సంబంధించిన పత్రాలు లేకపోతే రవాణాశాఖ అధికారులు కేసులు నమోదు చేస్తారు. కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల మోదీ సర్కార్ డిసెంబర్ నెల వరకు పర్మిట్లు, రిజిస్ట్రేషన్లు, లైసెన్స్ ల గడువు తీరినా చెల్లుబాటయ్యేలా ఆదేశాలు జారీ చేసింది.

డిసెంబర్ 31వ తేదీతో గడువు ముగియనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కిందిస్థాయి అధికారులకు జనవరి 1వ తేదీ నుంచి నిబంధనలు అమలయ్యేలా చూడాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయం వల్ల ఇకపై చెక్ పోస్టుల్లో తనిఖీలు ముమ్మరంగా జరగనున్నాయి. ప్రభుత్వం 2019 సంవత్సరంలో వాహనదారులకు షాక్ ఇచ్చేలా మోటారు వాహన చట్టాన్ని అమలులోకి తెచ్చిన సంగతి తెలిసిందే.

రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం నిబంధనలకు అనుగుణంగా జరిమానాలను భారీగా పెంచింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్, బండికి సంబంధించిన పత్రాలలో ఏది లేకపోయినా భారీగా జరిమానాలను చెల్లించాల్సి ఉంటుంది. వాహనదారులు పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్స్ పై అనర్హత వేటు వేయడంతో పాటు జైలు శిక్షలు విధించే అవకాశాలు ఉంటాయి.

కొత్త ఏడాదిలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. పన్నులు చెల్లించకుండా వాహనం నడిపినా, పర్మిట్లు లేకపోయినా రెట్టింపు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. రవాణాశాఖ సుప్రీం కోర్ట్ రోడ్ సేఫ్టీ కమిటీకి జనవరి 1 నుంచి నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే.