Tag Archives: orey rikshaw

ఒకప్పుడు ఈ రెండు రిక్షాలు ఢీ కొన్నాయి. కట్ చేస్తే.. బాక్సాఫీస్ పగిలిపోయింది.

ఈ నటులు ఇద్దరు కలిసి ఒకే తెరపై కనిపించారు. కొన్ని సంవత్సరాల తేడాతోనే వెండితెరకు పరిచయమయ్యారు. ఒకరు కోదండరామిరెడ్డి దర్శకత్వంలో విజయాలను అందుకుంటే మరొకరు దాసరి దర్శకత్వంలో తెరపై కనిపించారు. ప్రాణం ఖరీదు, కోతలరాయుడు లాంటి చిత్రాల్లో చిరంజీవి హీరోగా నటించగా, నారాయణమూర్తి సపోర్టింగ్ క్యారెక్టర్ లో చిరంజీవి పక్కన కనిపించారు.

చిరంజీవి సోలో హీరోగా ఎదుగుతూ అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారు. 1980 ప్రథమార్థంలో నారాయణమూర్తి స్నేహాచిత్ర బ్యానర్ స్థాపించి, హీరోగా నటిస్తూనే నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఇకపోతే 1995 వచ్చేసరికి చిరంజీవి, నారాయణ మూర్తి ఇద్దరూ బాక్సాఫీసు వద్ద పోటీ పడ్డారు. దాసరి చిత్రాల్లో ఎక్కువగా సపోర్టింగ్ రోల్ లో కనిపించిన నారాయణమూర్తిని హీరోగా పెట్టి ఏకంగా ఓ సినిమానే మొదలు పెట్టడం జరిగింది.

దాసరి ఫిల్మ్ యూనివర్సిటీ, దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన “ఒరేయ్ రిక్షా” చిత్రంలో ఆర్.నారాయణమూర్తి, రవళి హీరో, హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ సినిమాలో నారాయణమూర్తి కష్టపడి రిక్షానడుపుతూ.. తన గారాబాల చెల్లిని పెంచి పోషించే ఒక అన్నగా ఆర్.నారాయణమూర్తి నటించారు. 1995 నవంబర్ 9న ఒరేయ్ రిక్షా సినిమా విడుదలై బాక్సాఫీసు బరిలో సిద్ధంగా ఉంది.

ఇదే సంవత్సరంలో క్రాంతి కుమార్ నిర్మాణం కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన “రిక్షావోడు” చిత్రంలో చిరంజీవి, నగ్మా, సౌందర్య హీరో, హీరోయిన్లుగా నటించారు. కోడిరామకృష్ణ, చిరంజీవి కాంబినేషన్ లో ఇంట్లోరామయ్య వీధిలో కృష్ణయ్య, ఆలయ శిఖరం, గూడచారి నెం1, సింహపురిసింహం లాంటి చిత్రాలు వచ్చాయి. చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత 1995 డిసెంబర్ 14న “రిక్షావోడు” చిత్రంతో బాక్సాఫీస్ వద్ద పోటీలో నిలిచింది. ఈ రెండు చిత్రాలు రిక్షా అనే టైటిల్ తో వచ్చి బాక్సాఫీస్ బరిలో ఉండటం ప్రేక్షకులతో సహా సినీ పరిశ్రమ తీవ్ర ఉత్కంఠతో గమనించింది. బ్లాక్ బస్టర్ లాంటి చిత్రాలతో మోత మోగించిన మెగాస్టార్ ఈ సంవత్సరం ఊహించని విధంగా కొంత చతికిల పడ్డారు. ఆయన‌ నటించిన “రిక్షావోడు” చిత్రాన్ని వెనక్కు నెట్టి నారాయణమూర్తి తన రిక్షాను ముందుకు నడిపించి, బాక్సాఫీస్ వద్ద కనక వర్షాన్ని కురిపించాడు.