Tag Archives: rakta sambandham

Rakta Sambandham : ఈ సినిమాలో సావిత్రి మీకు చెల్లి పాత్రలో అనగానే అక్కినేని జారుకున్నారు.. కానీ ఎన్టీఆర్ ఒప్పుకున్నారు.!!

తమిళంలో శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, సావిత్రి ప్రధాన పాత్రల్లో నటించిన హిట్ సినిమా పాశమలర్. అన్నాచెల్లెళ్ళ అనుబంధం నేపథ్యంలో సాగే భారీ నాటకీయ చిత్రం ఇది. సినిమా నిర్మాత డూండీ తమిళ చిత్రం హక్కులు కొని, రచయితగా అప్పటికి సినీరంగానికి పూర్తి కొత్తవారైన ముళ్ళపూడి వెంకటరమణను నియమించుకున్నారు. అయితే భారీ నాటకీయత, శోకభరితమైన సన్నివేశాలూ ఉన్న హెవీ డ్రామా సాహిత్యరంగంలో హాస్యరచయితగా పేరొందిన ముళ్ళపూడి వల్ల ఏమవుతుందని పరిశ్రమ వర్గాలు పెదవి విరిచినా, డుండీ మాత్రం “హాస్యం, విరుపు తెలిసినవాడే హెవీడ్రామా రాయగలడు” అంటూ ప్రోత్సహించారు.

తమిళ స్క్రిప్ట్ అందగానే రమణ తెలుగు స్క్రిప్టును ముఖ్యమైన షాట్ విభజనలు సూచించడంతో సహా సినిమాను దాదాపు రెండు వారాల్లో రాసేశారు. దర్శకుడు వి.మధుసూదనరావు స్క్రిప్ట్ అయినంతవరకూ తీసుకురమ్మని రెండు వారాలకు అడగ్గానే, మొత్తం స్క్రిప్టును చేతిలో పెట్టడంతో ఒకేసారి స్క్రిప్ట్ చూసి ఒకే చేసేశారు. ఆ తర్వాత నిర్మాత డూండీ ఫ్యామిలీ, సెంటిమెంట్ పాత్రలకు పెట్టింది పేరైన అక్కినేనిని వెళ్లి కలిశారు. “పాశమలార్” తమిళ చిత్ర కథను అక్కినేనికి వినిపించడం జరిగింది.

అయితే ఈ చిత్రంలో అన్నా చెల్లెలు సెంటిమెంట్ తో ఉండడం వలన చెల్లి పాత్రలో సావిత్రిని తీసుకుంటున్నామని అక్కినేనితో చెప్పడంతో.. ఆయన ఒక్కసారి అవాక్కయ్యారు. గతంలో తను, సావిత్రి అనేక చిత్రాల్లో హీరో, హీరోయిన్ గా నటించమని.. ఇప్పుడు ఒక్కసారిగా “అన్నా చెల్లెలు” గా తెరపై కనిపిస్తే ప్రేక్షకులు తిరస్కరిస్తారేమోనని అక్కినేని సందేహాన్ని వ్యక్తం చేశారు. ఇదే తమిళ చిత్ర కథని మరో స్టార్ హీరో అయిన ఎన్టీఆర్ కు చెప్పడంతో.. ముందు సందేహం వ్యక్తం చేసినప్పటికీ.. కథ బాగా నచ్చడంతో సావిత్రిని చెల్లెలి పాత్రకు ఎన్టీఆర్ ఓకే చేశారు. సరిగ్గా 6 నెలల క్రితం ఎన్టీఆర్, అక్కినేని నటించిన మల్టీ స్టారర్ చిత్రం “గుండమ్మ కథ” విడుదలైంది.

ఇందులో ఎన్టీఆర్ కు జోడీగా సావిత్రి నటించగా.. అక్కినేనికి జోడిగా జమున నటించింది. అయినా ఎన్టీఆర్ ధైర్యంగా ఆయనతో సావిత్రి చెల్లెలిగా నటించడానికి ఒప్పుకున్నారు. ఎన్టీఆర్ సరసన దేవిక నటించారు. సావిత్రి సరసన కాంతారావు నటించారు. 1962 వి.మధుసూదనరావు దర్శకత్వంలో వచ్చిన “రక్త సంబంధం” చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఎన్టీఆర్, సావిత్రి అన్నా చెల్లెలుగా నటించి ప్రేక్షక హృదయాలను దోచుకున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఘంటసాల స్వరపరిచిన “బంగారు బొమ్మ రావేమే.. పందిట్లో పెళ్లి జరిగేనే” ఇప్పటికీ కొన్ని సినిమాల్లో పెళ్లికి సంబంధించిన సన్నివేశం రాగానే బ్యాక్ గ్రౌండ్ లో ఈ పాట రావడం అనేది సహజంగా మారిపోయింది.