Tag Archives: Ram Temple to open

భక్తులకు శుభవార్త.. ఆ రోజు నుంచే అయోధ్య రామయ్య దర్శనం ప్రారంభం..?

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు అయోధ్యలో రామ మందిర నిర్మాణం గురించి ఆసక్తిగా తెలుసుకుంటున్నారు. నిర్మాణం ఎప్పుడు పూర్తి అవుతుంది.. ఎప్పుడు దర్శనం చేసుకోవాలనే ఎక్కువగా మాట్లాడుతున్నారు. గతేడాది ఆగస్టు 5న ప్రధాని మోదీ చేతులమీదుగా రామ మందిర నిర్మాణం ప్రారంభమై యేడాది పూర్తవుతోంది. దేవాలయ సముదాయంలో మ్యూజియం, డిజిటల్ ఆర్కైవ్‌, పరిశోధనా కేంద్రం సహా అన్నీ కలిపి 2025 నాటికి నిర్మాణం పూర్తికానుంది.

అయితే నిర్మాణం పూర్తైనంత వరకు భక్తులు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. 2023 డిసెంబర్ నాటికే భక్తుల కోసం తెరువనున్నట్లు సమాచారం. అయితే అప్పటి వరకు పాక్షికంగా ఆలయ నిర్మాణం పూర్తి కానుంది. రామ్ లల్లా ఉన్నటువంటి గర్భగుడి ఆలయం పూర్తి కానుంది. మిగతా ప్రాంతంలో నిర్మాణ పనులు కొనసాగుతాయి. ఆలయంతో పాటు మ్యూజియం, డిజిటల్ ఆర్కైవ్‌లు, పరిశోధనా కేంద్రం కూడా ఆలయ సముదాయంలో నిర్మించబడతాయి.

ప్రస్తుతం దేవాలయ మొదటి దశ పనులు సాగుతున్నాయి. నవంబర్ నెలలో రెండవ దశ పనులు ప్రారంభం అవుతాయని ఇంజినీర్లు తెలిపారు. అయితే శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ రామ భక్తులకు పెద్ద ఆఫర్ ప్రకటించింది. రామ భక్తులందరూ ఇప్పుడు రామ మందిర నిర్మాణ పనులను అక్కడికి వెళ్లి చూడవచ్చు. దీని కోసం ఒక వ్యూపాయింట్ నిర్మించబడుతుంది. అయోధ్యకు వచ్చే భక్తులు ఆలయ నిర్మాణ పనులను తమ కళ్లతో చూడగలుగుతారని ప్రకటించారు.

గంతంలో టెంట్ లో కూర్చొని రామ్ లల్లాను దర్శించుకునే వారు. ఇప్పడు దానిని దేవాలయంగా మార్చేశారు. మూడు అంతస్తులుగా అంగరంగ వైభవంగా రూపొందనున్న రామ మందిరంలో ఐదు గోపురాలు ఉంటాయి. శిథిలాలు తొలగించిన స్థలాలను నింపేందుకు ఇప్పటికే రోజుకు 140 ట్రక్కుల మట్టి వస్తోంది. ఈ పనులు మార్చి నుంచి ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ పనులు ఐఐటీ చెన్నై ఆధ్వర్యంలో సాగుతున్నాయి.