Tag Archives: request to sec

నిమ్మగడ్డకు షాకిచ్చిన ఉద్యోగులు.. ప్రాణాలు పణంగా పెట్టలేమంటూ..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కీలక మలుపులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. మార్చి నెలలో కరోనా వల్ల ఎన్నికలు వాయిదా పడగా ప్రస్తుతం ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఎన్నికలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ మాత్రం ఎన్నికలు నిర్వహించడానికి సుముఖంగా లేదు. కరోనా విజృంభణ నేపథ్యంలో ఎన్నికల వాయిదాకే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది.

అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు భారీ షాక్ ఇచ్చారు. ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి రాష్ట్రంలో కేసుల సంఖ్య తగ్గినా కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎన్నికల కమిషన్ పునరాలోచన చేయాలని అన్నారు. ప్రజలు, ఉద్యోగులు కరోనా వైరస్ పేరు చెబితేనే భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితి నెలకొందని వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని.. ఉద్యోగులు స్థానికల సంస్థల ఎన్నికల కొరకు ప్రాణాలను పణంగా పెట్టాల్సి రావడం సరికాదని చెప్పారు. రాష్ట్రంలో కరోనా పూర్తిగా తగ్గి పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే మంచిదని వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులు పరిపానా రాజధానిగా విశాఖను కోరుకుంటున్నారని వెల్లడించారు.

మరికొన్ని రోజుల్లో అమరావతిలో పని చేస్తున్న ఉద్యోగులు విశాఖకు రానున్నారని తెలిపారు. సీఎం జగన్ కరోనా, లాక్ డౌన్ వల్ల గతంలో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించగా ఆ వేతనాలను తిరిగి చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. జగన్ మూడు డీఏలు ఇవ్వడానికి సుముఖంగా ఉన్నారని.. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా సీం జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నాడని తెలిపారు.