Tag Archives: sand

ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్.. ఉచితంగా ఇసుక..?

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ పేద ప్రజలకు మరో శుభవార్త చెప్పింది. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ కరోనా విజృంభణ వల్ల కోత పెట్టిన వేతనాలను డిసెంబర్, జనవరి నెలల్లో ప్రభుత్వం చెల్లిస్తుందని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగుల కోత విధించిన వేతనాలకు 2,324 కోట్ల రూపాయలు, ఫించనుదారులకు 482 కోట్ల రూపాయలు చెల్లిస్తుందని వెల్లడించారు. కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలను చెప్పారు.

నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సీఎం జగన్ సూచించారని తెలిపారు. రాష్ట్రంలో 31,300 ఎకరాల పంటకు తుఫాను వల్ల నష్టం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 10,000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని.. 500 రూపాయల చొప్పున పునరావాస శిబిరాల్లో ఉన్నవారికి చెల్లింపులు చేశామని అన్నారు. వచ్చే నెల 30 నాటికి పంట నష్టం అంచనా వేసి రైతులకు అందజేస్తామని పేర్కొన్నారు.

వచ్చే నెల 25వ తేదీన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని.. ఈ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేస్తుందని కన్నబాబు వెల్లడించారు. తొలి దశలో 16 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. వైఎస్సార్ పంటల బీమా చెల్లింపులు వచ్చే నెలలో అమలు చేస్తామని అన్నారు. డిసెంబర్ 2న అమూల్ ప్రాజెక్ట్, డిసెంబర్ 10న మేకలు, గొర్రెల పంపిణీ చేపట్టనున్నట్టు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ చట్టం 1974లో సవరణలు చేస్తున్నట్టు తెలిపారు. పల్నాడు ప్రాంతంలో కరువు నివారణకు కార్పొరేషన్, ఉత్తరాంధ్రలో ప్రాజెక్టుల కోసం అభివృద్ధి కార్పొరేషన్ ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. వాస్త్రవ డిజైన్ ల ఆధారంగా పోలవరం నిర్మాణం జరుగుతుందని అన్నారు.