Tag Archives: semester system elementary level

జగన్ సంచలనం.. ఒకటో తరగతి నుంచే సెమిస్టర్ విధానం?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం కొన్ని రోజుల క్రితం ఆమోదం తెలిపిన జాతీయ విద్యా విధానం 2020కు అనుగుణంగా సిలబస్ ను మార్చివేసేలా ఆదేశాలు జారీ చేశారు. సిలబస్ మార్పుల గురించి రాష్ట్ర విద్యా పరిశోధనా సంస్థ ఇప్పటికే కసరత్తులు ప్రారంభించింది. రాష్ట్రానికి చెందిన బృందం ఇప్పటికే ఇతర రాష్ట్రాలతో పాటు, ఇతర దేశాలకు సంబంధించిన ప్రాథమిక విద్యా విధానాలను పరిశీలించింది.

పలు రాష్ట్రాలలో అమలులో ఉన్న ఎన్సీఈఆర్టీ సిలబస్ ను కూడా పరిశీలించి విద్యార్థులకు ప్రయోజనం చేకూరే విధంగా కొత్త సిలబస్ ను తయారు చేసే పనిలో పడింది. రాష్ట్ర విద్యా శాఖ కమీషనర్‌ చినవీరభద్రుడు సీఎం జగన్ సూచనల ఆధారంగా రాష్ట్ర విద్యా పరిశోధనా సంస్థ కొత్త సిలబస్ ను రూపొందిస్తోందని వెల్లడించారు. జగన్ సర్కార్ ఒకటవ తరగతి నుంచి ఆరవ తరగతి వరకు సిలబస్ లో మార్పులు చేయనుందని సమాచారం.

కొత్త విద్యా విధానం ద్వారా విద్యావ్యవస్థలో మార్పులు తీసుకురావాలని.. విద్యార్థులకు ప్రయోజనం చేకూరే విధంగా సిలబస్ ఉండాలని జగన్ సర్కార్ భావిస్తోంది. అధికారులు నూతన సిలబస్ కు అనుగుణంగా ఇప్పటికే పాఠ్య పుస్తకాలను, వర్క్ బుక్ లను రూపొందించారని సమాచారం. జగన్ సర్కార్ రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి సెమిస్టర్ విధానాన్ని అమలులోకి తీసుకురావాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

మూడు సెమిస్టర్ లకు అనుగుణంగా అధికారులు పాఠ్యపుస్తకాలను రూపొందించినట్లు సమాచారం. ప్రభుత్వం విద్యార్థులను ఆకర్షించే విధంగా వేర్వేరు రంగులతో కూడిన బొమ్మలతో పుస్తకాలను రూపొందించిందని తెలుస్తోంది. ప్రభుత్వం స్పెషల్ టీంలను నియమించి బుక్స్ ప్రింటింగ్ సకాలంలో జరిగే విధంగా చర్యలు చేపడుతోంది. వచ్చే సంవత్సరం జూన్ నెల నుంచి రాష్ట్రంలో కొత్త విధానం ద్వారా బోధన జరగనుందని తెలుస్తోంది.