Tag Archives: sreemanthudu

ANR – MB : ఒకే టైటిల్ తో వచ్చిన అక్కినేని, మహేష్ బాబు చిత్రాలు ఎలా ప్రదర్శింపబడ్డాయో చూడండి.!!

1971 జగపతి ఆర్ట్ పిక్చర్స్ లో “దసరా బుల్లోడు” లాంటి బ్లాక్ బస్టర్ లో నటించి మంచి స్వింగ్ లో ఉన్న అక్కినేనికి వెంటనే అనేక చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. అంతకుముందే విజయా సంస్థలో వచ్చిన “గుండమ్మ కథ” చిత్రంలో అక్కినేని-జమున బెస్ట్ కపుల్ అనిపించుకున్నారు. ఆ తర్వాత అక్కినేని-జమున మరోసారి తెర మీద కనిపించారు.

ఆతర్వాత జమున 1971లో చలంతో “మట్టిలో మాణిక్యం” అనే విజయవంతమైన చిత్రంలో నటించారు. అటు అక్కినేని ఇటు జమున ఇద్దరూ హిట్ చిత్రాల్లో నటించి మంచి జోష్ లో ఉన్నారు.

అలా వీరిద్దరి కాంబినేషన్ లో మరో చిత్రం వచ్చింది. 1971 విశ్వభారతి ప్రొడక్షన్స్,ప్రత్యగాత్మ దర్శకత్వంలో “శ్రీమంతుడు” చిత్రం విడుదల అయ్యింది. అక్కినేని, జమున హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి తాతినేని చలపతిరావు సంగీత సారథ్యంలో “బులి బులి ఎర్రని బుగ్గల దానా.. చెంపకు చారెడు కన్నుల దాన మారిపోయావా.. అనే పాట ఆ రోజుల్లో ప్రజాదరణ పొందిన పాటగా చెప్పవచ్చు. గుమ్మడి, రమణారెడ్డి, రాజబాబు, సూర్యకాంతం లాంటి భారీ తారాగణంతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచిపోయింది..

ఇక కొరటాల శివ సందేశాత్మక కథలను కమర్షియల్ పంథాలో తెరకెక్కించగల సమర్థుడైన దర్శకుడు. అలా ప్రభాస్ నటించిన “మిర్చి” సినిమా అనంతరం మహేష్ బాబుతో మరో సినిమా నిర్మించారు. 2015 మైత్రి మూవీ మేకర్స్,కొరటాల శివ దర్శకత్వంలో “శ్రీమంతుడు” చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో మహేష్ బాబు, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఆగర్భ శ్రీమంతుడు మహేష్ బాబు ఊరి కోసం తన ప్రేమను, కోట్ల రూపాయల ఆస్తిని కాదనుకొని ఉత్తరాంధ్రలోని దేవరకోట ఊరిని దత్తత తీసుకొని ఆ గ్రామంలో నివసిస్తున్న ఎంపి సోదరుడు చేసే అక్రమాలను అడ్డుకుంటారు. పల్లె కోసం ప్రతికూల పరిస్థితులలో సైతం మహేష్ బాబు కృషిచేస్తాడు.

ఒకసారి అవినీతి మూకల హత్యాప్రయత్నం నుండి మహేష్ బాబు బయట పడతాడు. చివరికి ఊరును అభివృద్ధి చేసి తన లక్ష్యాన్ని చేరుకుంటాడు. కోట్లరూపాయల వ్యాపారం పక్కన పెట్టి, గ్రామ క్షేమం కోసం మహేష్ బాబు పాటుపడడంతో శృతిహాసన్ ఇంకా ఆయనను ప్రేమిస్తుంది. అలా చివరికి ఊరికి అన్యాయం చేసే ఎంపి సోదరులను కడతేర్చి మహేష్ బాబు పల్లెకు న్యాయం చేస్తాడు. దేవిశ్రీ సంగీత సారధ్యంలో వచ్చిన పోరా శ్రీమంతుడా పో.పో.. పోరా శ్రీమంతుడా.. అనే పాట సినిమాకి హైలెట్ గా చెప్పవచ్చు. కమర్షియల్ హంగులతో సందేశాత్మకంగా వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ప్రభావంతో గ్రామాలను దత్తత తీసుకోవడం అనే అంశం బహుళ ప్రజాదరణ పొందింది.