Tag Archives: train services

రైలు ప్రయాణికులకు శుభవార్త.. దేశంలోకి ప్రైవేట్ రైళ్లు..?

రైల్వే శాఖ రైలు ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త చెప్పడానికి సిద్ధమైంది. ఎకనమిక్ సర్వే ద్వారా దేశంలోకి ప్రైవేట్ రైళ్లు రావడానికి రంగం సిద్ధమైందని వెల్లడైంది. ఈ ఏడాది మే చివరి వరకు ప్రైవేట్ రైళ్ల కొరకు బిడ్స్ ఆహ్వానం జరుగుతుందని తెలుస్తోంది. దేశంలో ప్రస్తుతం ప్రభుత్వ రైళ్లు మాత్రమే అందుబాటులో ఉండగా ప్రైవేట్ రైళ్లు అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు లభించే అవకాశం ఉంటుంది.

2023 – 2024 నాటికి దేశంలోకి ప్రైవేట్ రైళ్లు రావచ్చని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఎకనమిక్ సర్వేలో పేదలను పేదరికం నుంచి బయటపడేయటానికి ఆర్థిక వృద్ధిని కొనసాగించాలని అభిప్రాయపడింది. కరోనా విజృంభణ అనేక రంగాలపై ప్రభావం చూపిందని అయితే వ్యవసాయ రంగంపై మాత్రం కరోనా ప్రభావం పడలేదని వెల్లడైంది. వ్యవసాయ రంగంలో వృద్ధి నమోదైందని తెలిపింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 7.7 శాతం తగ్గే అవకాశం ఉందని.. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో మాత్రం జీడీపీ 11 శాతం పెరగవచ్చని ఆర్థిక శాఖ అభిప్రాయపడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టెలీ మెడిసిన్ పై ఇన్వెస్ట్ చేసి డిజిటల్ హెల్త్ మిషన్ కు కృషి చేయాలని ఆర్థిక శాఖ సూచనలు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలినాళ్లలోనే ప్రీ కోవిడ్ స్థాయికి చేరవచ్చని ఆర్థిక శాఖ తెలిపింది.

ప్రైవేట్ రైళ్ల దిశగా కేంద్రం అడుగులు వేయడంపై రైలు ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్ లో సామాన్య, మధ్యతరగతి వర్గాలకు ప్రయోజనం చేకూర్చే ఎన్నో నిర్ణయాలు కేంద్రం అమలు చేయనుందని తెలుస్తోంది