కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందా.. అయితే ఏం చేయాలంటే..?

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా సోకుతుందో తెలియని కరోనా వైరస్ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు, వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే కరోనా వైరస్ సోకిన తరువాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సులభంగా వైరస్ నుంచి కోలుకోవచ్చు.

చాలామంది కరోనా సోకిందని తెలిసిన వెంటనే కంగారు పడుతూ ఉంటారు. అయితే మందులు వాడుతూ సరైన ఆహారం తీసుకుంటే తక్కువ సమయంలోనే వైరస్ నుంచి కోలుకోవచ్చు. కరోనా నిర్ధారణ అయితే ఆస్పత్రికి వెళ్లకుండా హోం ఐసోలేషన్ లో ఉండి చికిత్స చేయించుకుని కూడా కోలుకోవచ్చు. కరోనా నిర్ధారణ అయిన వెంటనే వైద్యుడిని సంప్రదించి వాడాల్సిన మందుల గురించి తెలుసుకుని సలహాలు, సూచనలు తీసుకోవాలి.

కరోనాతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యునికి ముందుగానే తెలియజేయాలి. అలా చేయడం వల్ల వైద్యులు మందులు ఇచ్చే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. హోం ఐసోలేషన్ లో ఉంటే మిగతా కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలి. వారికి మీ నుంచి వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేక బాత్ రూమ్ ఉండటంతో పాటు వెంటిలేషన్ తగిలేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

వైరస్ లక్షణాలు, తీవ్రతను బట్టి చికిత్సలో మార్పులు ఉంటాయి. తరచూ ఆక్సిజన్ లెవెల్స్ ను తప్పనిసరిగా చెక్ చేసుకుంటూ ఉండాలి. మందులు వాడుతున్నా లక్షణాలు తగ్గకపోతే ఇతర కరోనా పరీక్షలను చేయించుకోవాలి. పూర్తిగా కోలుకుని నెగిటివ్ నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే బయటకు వెళ్లాలి. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.