మందులు వాడే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

మనలో చాలా మంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు సైతం మందులు వాడటం అలవాటు చేసుకున్నారు. అదేవిధంగా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారు ఈ మందులను వాడుతూనే ఉండాలి. నిత్యం ఈ మందులు వాడుతున్నప్పుడు చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటాం.ఈ విధంగా మందులు వాడేటప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే మరికొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. అయితే మందులను వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం…

మనం ఏదైనా మందులు లేదా మాత్రలను తీసుకుంటున్నప్పుడు వాటిపై ఎక్స్పైరీ డేట్ తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. అదే విధంగా ఏదైనా ప్రిస్క్రిప్షన్ తీసుకుని మందులు కొనుగోలు చేసేటప్పుడు అవి సరైన కదా అని చెక్ చేసుకోవడం ఎంత అవసరం. కొందరు టాబ్లెట్ మాత్రమే కాకుండా సిరప్ కూడా వాడుతుంటారు.ఈ విధంగా వాడేవారు డాక్టర్లు సూచించిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. అదేవిధంగా సిరప్ బాటిల్ మూతలను పూర్తిగా మూసి వేయాలి. లేదంటే ఆ మందులలో ఫంగల్ ఇన్ఫెక్షన్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

మనం వాడే మందులను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడపడితే అక్కడ ఉంచకూడదు. వాటిని తగినంత ఉష్ణోగ్రతల వద్ద మాత్రమే నిల్వ చేసుకోవాలి. ఆ విధంగా నిల్వ చేసుకున్నప్పుడు మాత్రమే ఔషధాలు వాడినప్పటికీ మన శరీరానికి పని చేస్తాయి.ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద మందులను నిల్వ ఉంచినప్పుడు వాటి ప్రభావం మన శరీరంపై చూపకుండా ఇతర సమస్యలను తలెత్తేలా చేస్తాయి. డయాబెటిస్ తో బాధపడే వారు ఇన్సులిన్ ను తప్పనిసరిగా ఫ్రిజ్ లో మాత్రమే నిల్వ చేసుకోవాలి. ఒకవేళ ఫ్రిజ్ అందుబాటులో లేనివారు ఒక కుండలో నీటిని పోసి అందులో భద్రపరచుకోవాలి. ఈ విధమైన జాగ్రత్తలను పాటించడం ద్వారా మనం వాడే మందులు, టాబ్లెట్ ల నుంచి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని నిపుణులు తెలియజేస్తున్నారు.