వర్షపు నీటిని ఒడిసి పట్టి.. ఇలా చేయండి.. మీ ఆయుష్షు పెరిగినట్టే..?

ప్రస్తుతం ఎక్కడ చూసినా కలుషితం. అటువంటి ఆహారాన్ని తినడం వల్ల వ్యాధుల బారిన పడుతున్నారు. ఒకప్పుడు ఉన్న పరిస్థితులు ప్రస్తుతం కనిపించడం లేదు. దాహం వస్తే ఒకప్పుడు కుళ్లాయి దగ్గరకు వెళ్లి మంచి నీళ్లు తాగేవారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా పోయింది. మినరల్ వాటర్ లేనిదే చాలామంది నీటిని తాగడం లేదు. ప్రతీ గ్రామంలో దాదాపు మినరల్ వాటర్ ప్లాంట్ ఉంది. దీనిని బట్టే అర్థం అవుతోంది.. పల్లెల్లో కూడా స్వచ్చమైన తాగునీటికి కరువు ఏర్పడిందని.

ఇటువంటి సమయంలో .. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా రామచంద్రపురం మండలం పివిపురం బలిజపల్లిలో గుణశేఖర్ రెడ్డి కుటుంబం తాగునీటి విషయంలో వినూత్నంగా ఆలోచించింది. వర్షపు నీటిని ఒడిసి పట్టి వాటిని.. పైపుల్లోకి అమర్చిరైన్ టాప్ రూఫ్ వాటర్ ఫిల్టర్ ద్వారా శుద్ధి చేసేలా ఏర్పాటు చేశారు. అలా శుభ్రం అయిన నీటిని వాటర్ క్యాన్లలో పట్టి.. వాటిని భూమిలో ఏర్పాటు చేసిన సంపులోకి వదిలిపెట్టారు.

అందులో బొగ్గు, పచ్చి గడ్డి, ఇసుక, గులకరాళ్లుతో వలతో వివిధ లేయర్లుగా ఏర్పాటు చేశారు. ఇలా వాటి నుంచి ఫిల్టర్ అయిన వర్షపు నీటిని తాగడానికి ఉపయోగిస్తామని వాళ్లు తెలిపారు. వీటికి దాదాపు రూ.2 లక్షల వరకు ఖర్చు అయిందని చెప్పుకొచ్చారు. నిజానికి వర్షపు నీరు ప్రపంచంలోనే అత్యంత శుభ్రమైందట. సైంటిస్టులు చేసిన అధ్యయనాలే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి.

అయితే వర్షపు నీటిని నేరుగా పట్టుకోవాలి. అది కూడా శుభ్రమైన పాత్రల్లో పట్టుకుని నిల్వ చేసుకోవాలి. ఇలా పైన చెప్పిన విధంగా నిల్వ చేసుకున్న నీటిని తాగవచ్చని నిపుణులు కూడా చెబుతున్నారు. అలా తయారు చేసుకున్న నీటి వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరవని గుణశేఖర్ అంటున్నారు. ఈ నీటిని తాగడం వల్ల ఆయుష్షు కూడా పెరుగుతుందని పేర్కొన్నారు.