ఇకపై ప్రయాణికుల వద్దకే బస్సు సౌకర్యం.. కీలక నిర్ణయం తీసుకున్న టిఎస్ఆర్ట్ సి ఎండీ సజ్జనార్!

సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వీసీ సజ్జనార్ టీఎస్ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పదవి బాధ్యతలు స్వీకరించిన వెంటనే సామాన్యుడిలా బస్సులో టికెట్ తీసుకొని పలు బస్ స్టేషన్లకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బస్ లపై అసభ్యకరమైన పోస్టర్లను అంటించవద్దని ఇటీవల ఓ నెటిజన్ ట్విట్టర్లో సజ్జనార్ ను రిక్వెస్ట్ చేయగా.. స్పందించిన సజ్జనార్ వాటిని తొలగించేందుకు ఏర్పాటు చేయాలని.. ఒక్క బస్సుపై కూడా అలాంటి పోస్టర్లు ఉండకూడదని కూడా ఆదేశాలు జారీ చేశారు.

ఆర్టీసీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఆర్టీసీని లాభాల బాటలో నడిపేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న జీతానికి సబంధించిన సమస్యలను కూడా నెరవేర్చారు. కొన్ని సంవత్సరాలుగా ప్రతీ నెల మొదటి తేదీన పడే జీతాలు.. తర్వాత కొన్ని కారణాల వల్ల నెల 10 నుంచి 15 మధ్యలో జీతాలు క్రెడిట్ అవుతున్నాయి.

వాటికి చరమగీతం పాడుతూ.. ప్రతీ నెల 1నే జీతాలు అందేలా చర్యలు తీసుకున్నారు. ఇదంతా అటు ఉంచితే.. తాజాగా దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో మరో నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణికుల వద్దకే బస్సులను పంపేలా సంచలన నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి ప్రత్యేక బస్సులను నడపనుంది ఆర్టీసీ. హైదరాబాద్ నుంచి ఊళ్లకు వెళ్లే ప్రయాణికులు కొత్త సౌకర్యాన్ని కల్పించారు. ఏదైనా ప్రదేశం నుంచి 30 లేదా అంతకంటే ఎక్కువ మంది ఒకే ప్రదేశానికి వెళ్లాలనుకుంటే స్టేషన్ కు రాకుండానే బస్సు వెళ్లి పికప్ చేసుకునే అవకాశం కల్పిస్తూ ఎండీ సజ్జనార్ నిర్ణయం తీసుకున్నారు.

కార్మికులు అయినా, విద్యార్థులు అయినా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు అన్నారు. నగరంలోని ఎంజీబీఎస్, కోఠి, రేతిఫైల్ బస్టాండ్‌లలో ఫోన్ నంబర్లు ఏర్పాటు చేశారు. ఒకవేళ ఈ సదుపాయం కావాలనుకుంటే.. 24 గంటల ముందు అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాల్సి ఉంటుంది.