రుణ గ్రహీతలకు కేంద్రం శుభవార్త.. మారటోరియం టైంలో వడ్డీపై వడ్డీ మాఫీ ?

కరోనా, లాక్ డౌన్ దేశంలోని ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేసిన సంగతి విదితమే. లాక్ డౌన్ వల్ల మిగతా వాళ్లతో పోల్చి చూస్తే వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీ నష్టాలను చవిచూశారు. వ్యాపారులు, ఉద్యోగులు పడుతున్న కష్టాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం, ఆర్బీఐ ఆరునెలల మారటోరియం విధించాయి.. అయితే లోన్లపై మారటోరియం విధించినా వ్యాపారులు బ్యాంకులకు వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది.

అయితే తాజాగా కేంద్రం రుణాలు తీసుకున్న వాళ్లకు తీపికబురు చెప్పింది. వడ్డీపై వడ్డీ వదులుకోవడానికి సిద్ధమేనని కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసి ఈ విషయాలను వెల్లడించింది. రుణ గ్రహీతలకు మారటోరియం ప్రయోజనాలు కలగాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. రెండు కోట్ల రూపాయల లోపు రుణాలు తీసుకున్న వారికి కేంద్రం నిర్ణయం వల్ల ఉపశమనం కలగనుంది.

2020 సంవత్సరం మార్చి నెల నుంచి ఆగష్టు నెల వరకు ఈ మాఫీ వర్తించనుంది. కేంద్రం అఫిడవిట్ లో క్రెడిట్ కార్డ్ బకాయిలు, ఎం.ఎస్.ఎం.ఈలు, విద్య, వాహన, వినియోగ వస్తువులపై రుణాలు తీసుకున్న వారందరికీ కేంద్రం మేలు చేకూరుస్తోంది. ఆర్థిక నిపుణులు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. కేంద్రం పార్లమెంట్ అనుమతితో వడ్డీపై వడ్డీ మాఫీకి నిధులను కేటాయించనుంది.

గతంలో ఆర్బీఐ మారటోరియం టైంలో వడ్డీపై వడ్డీ మాఫీ చేయడం సాధ్యం కాదని వెల్లడించాయి. అయితే వడ్డీ చెల్లిస్తే మారటోరియం వల్ల ప్రయోజనం ఏమిటని పలువురు కోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు దాఖలైన పిటిషన్ల పట్ల కేంద్రం వైఖరి తెలపాలని కోరగా కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసి రుణ గ్రహీతలకు ఊరట కలిగేలా నిర్ణయం తీసుకుంది.