ఖైరతాబాద్ వినాయకుడి గురించి మీకు తెలియని కొన్ని నిజాలు.. తెలుసుకోండి..

వినాయక చవితి పండుగ వచ్చిందంటే చాలు.. ఎక్కువగా మాట్లాడుకునేది ఖైరతాబాద్ గణేశుడి గురించే. ఈ సంవత్సరం ఎన్ని అడుగులు తయారు చేశారు.. ఏ రూపంలో వినాయకుడి ప్రతిష్టిస్తారు అనేది చర్చించుకుంటారు. అలా ఖైరతాబాద్ గేణేశుడు 11 రోజులు పూజలందుకున్న తర్వాత హుస్సెన్ సాగర్ లో నిమజ్జనం చేస్తారు. ఇలా ప్రతీ సంవత్సరం జరుగుతూ ఉంటుంది. అయితే ఖైరతాబాద్ లో ఏ సంవత్సరం నుంచి వినాయకుడిని ప్రతిష్టిస్తున్నారు.

దాని యొక్క విశిష్టతలు ఏంటి.. అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. మొదటిసారిగా 1954లో ఖైరతాబాదు కౌన్సిలరుగా ఉన్న సింగరి శంకరయ్య ఈ ఉత్సవాలను నిర్వహించడం ప్రారంభించాడు. అప్పట్లో కేవలం ఒక్క అడుగు విగ్రహాన్ని మాత్రమే ప్రతిష్టించారు. ఇలా ప్రతీ సంవత్సరం ఒక్కొ అడగు పెంచుకుంటూ.. 60 ఏళ్ల వరకు ఇలానే చేశారు. 2014 సంవత్సరంలో అత్యధికంగా 60 అడుగులు ప్రతిష్టించారు. అప్పడు వినాయకుడు సకుటుంబ సపరివార సమేత శివ పరివారం అవతారంలో దర్శనం ఇచ్చారు. 2014 నుంచి ఒక్కో అడుగు తగ్గిస్తూ వస్తున్నారు.

విగ్రహం ఎత్తు తగ్గినా రూపకల్పనలో ప్రతి సంవత్సరం వైవిధ్యతను చాటుతున్నారు. ప్రస్తుతం శంకరయ్య సోదరుడు సింగరి సుదర్శన్‌ వినాయకుడి ఏర్పాట్లు చూసుకుంటున్నాడు. తొలినాళ్లలో ఇక్కడ విగ్రహానికి 20 నుంచి నెల రోజుల వరకు ఉత్సవాలను నిర్వహించేవారట. 1982లో భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ ఖైరతాబాద్‌ ఉత్సవ నిర్వాహాకులను కలిసి 11 రోజులకే నిమజ్జనం చేసేలా ఒప్పించారు. ఇదే సంవత్సరంలో రెండు పడవలను కలిపి వాటిపై విగ్రహాన్ని హుస్సేన్‌సాగర్‌ మధ్యలోకి తీసుకెళ్లి నిమజ్జనం చేశారట. అప్పటి నుంచి 11 రోజుల ఉత్సవాలు జరిపిస్తున్నారు.

ఇక్కడ మరో విషయం ఏంటంటే.. 1960లో ఏనుగుపై ఊరేగిస్తూ సాగర్‌కు తీసుకెళ్లి విగ్రహాన్ని నిమజ్జనం చేయడం విశేషం. కరోనా కారణంగా కేవలం 9 అడుగుల విగ్రహాన్ని తయారు చేసి 2020 లో ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనం చేశారు. 2021 అంటే ప్రస్తుతం 40 నుంచి 50 అడుగుల మధ్య వినాయకుడిని ప్రతిష్టించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతి రూపంలో దర్శనమిచ్చారు. మరో విషయం ఏంటంటే.. ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర లడ్డును 2011 నుంచే ఉంచేవారట. అప్పటి నుంచి లడ్డూ పూజలను అందుకుంటూ ఎవరో ఒకరు వేలం పాట పాడి దక్కించుకునే వారు.