చికెన్, మటన్ తినేవాళ్లకు షాకింగ్ న్యూస్.. అక్కడ తిన్నారో అంతే సంగతులు..?

దేశంలో మాంసాహార ప్రియులు ఎక్కువనే సంగతి తెలిసిందే. సండే వచ్చిందంటే చాలు చాలామంది చికెన్, మటన్ ఇష్టంగా తింటారు. ముక్క లేనిదే ముద్ద దిగని వాళ్లు దేశంలో చాలామందే ఉన్నారు. అయితే ఎక్కడ పడితే అక్కడ మాంసం కొనుగోలు చేస్తే మాత్రం ఇబ్బందుల్లో పడినట్లే. ఏపీలోని విజయవాడ నగరంలో మాంసం మాఫియా ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటోంది. చచ్చిన కోళ్లు, మేకలను విక్రయిస్తూ ప్రజలకు కొత్త ఆరోగ్య సమస్యలను సృష్టిస్తోంది.

మాంసం మాఫియా నగరంలో ప్రముఖ హోటళ్లకు, రెస్టారెంట్లకు ఇదే మాంసాన్ని విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. ఆదివారం రోజున నగరంలోని పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్న చికెన్, మటన్ సైతం కుళ్లిపోయిన, చనిపోయిన జంతువులది అని తెలుస్తోంది. ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు, వీఎంసీ వెటర్నరీ అధికారులు ఈ నెల మొదటి వారంలో చేసిన తనిఖీల్లో 400 కేజీల నిల్వ ఉన్న మాంసం అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

నగరంలోని పలు ప్రాంతాల్లో ఫ్రిజ్ లలో పురుగులు పట్టి ఉన్న మాంసాన్ని సైతం అధికారులు గుర్తించారు. నగరంలో అధికారుల తనిఖీల్లో నిల్వ ఉన్న మాంసం, పురుగులు పట్టిన మాంసం దొరకడంతో అధికారులు ఆ మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కబేళాలో మటన్, బీఫ్ లకు వీఎంసీ స్టాంప్‌ వేయించుకోవాలి. అయితే నగరంలో చాలామంది వ్యాపారులు నిబంధనలను పాటించడం లేదు.

అధికారులు దాడులు చేసి వందల కిలోల మాంసం స్వాధీనం చేసుకుంటున్నా వ్యాపారుల్లో మార్పు రాకపోవడం గమనార్హం. అధికారులు ప్రజలు మాంసం కొనుగోలు చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని వైద్యులు, అధికారులు సూచనలు చేస్తున్నారు.