Younger Sarpanch: కోడలిగా అత్తారింటిలోకి అడుగు పెట్టి గ్రామాన్నే మార్చిన యువతి.. ఎందరికో ఆదర్శం!

Younger Sarpanch: సమాజాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్నా, సమాజంలో మార్పు తీసుకురావాలన్న ముందు మన ఆలోచనా ధోరణి మారాలి. అప్పుడే ఎంతటి కష్టమైన పనిని కూడా ఎంతో సునాయసంగా చేయవచ్చు. ఇలా మన ఆలోచనల్లో మార్పు వస్తే సమాజాన్ని మార్చడం పెద్ద కష్టమైన పని కాదని నిరూపించారు ప్రియాంక తివారీ. గ్రామ సర్పంచ్ గా ఏడాదిలోపు తన గ్రామ రూపు రేఖలను మార్చి ఎందరితో ప్రశంసలు అందుకుంటున్నారు.

రాజస్థాన్‌లో పుట్టి ఢిల్లీలో పెరిగిన 29 ఏళ్ల ప్రియాంక తివారీ మాస్‌ కమ్యునికేషన్స్‌లో గ్రాడ్యుయేషన్‌ చేసింది. 2019లో ఉత్తరప్రదేశ్ లోని రాజ్ పూర్ గ్రామానికి చెందిన ఒక వ్యాపారవేత్తతో వివాహం జరగడంతో ఈమె ఉత్తరప్రదేశ్ లోని రాజ్ పూర్ గ్రామానికి కోడలిగా అడుగుపెట్టింది. ఢిల్లీలో పెరిగిన ప్రియాంకకు ఆ గ్రామ వాతావరణం ఏమాత్రం నచ్చలేదు. ఎలాగైనా తన గ్రామ రూపురేఖలను మార్చాలనే ఆలోచన చేసింది.

అదే సమయంలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు రావడంతో తమ కోడలి ఆలోచనలను తెలుసుకున్న వారి అత్తమామలు తనని గ్రామ సర్పంచ్ గా ఎన్నికలలో పోటీ చేయమన్నారు.ఈమె తన ఆలోచనలన్నింటినీ గ్రామ ప్రజలకు అర్థమయ్యేలా వివరించి పంచాయతీ ఎన్నికలలో సర్పంచిగా ఎన్నికయ్యారు. ఈమె సర్పంచిగా ఎన్నికవడంతోనే గ్రామంలో ముందుగా ప్లాస్టిక్ నిషేధాన్ని అమలులోకి తీసుకు వచ్చారు.

అభివృద్ధి పథంలో రాజాపూర్ గ్రామం..


గ్రామంలో ప్లాస్టిక్ ఎక్కడ ఉపయోగించకూడదని పంచాయతీ నుంచి బట్టతో తయారు చేసిన బ్యాగులను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇలా దాదాపు ఏడాది లోపే 75% ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేశారు. ఇలాప్లాస్టిక్ నిషేధాన్ని ప్రోత్సహించడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈమెను ప్రోత్సహిస్తూ తొమ్మిది లక్షల రూపాయల నజరానా ప్రకటించారు. ఆ డబ్బులను కూడా ఈమె గ్రామ అభివృద్ధి కోసం ఉపయోగిస్తూ రాష్ట్రం మొత్తం గ్రామం వైపు చూసేలా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు.ఈ విధంగా ఆ ఊరికి కోడలిగా వచ్చిన ప్రియాంక గ్రామ ప్రజలలో వారి ఆలోచనలో మార్పు తీసుకువచ్చి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఎందరికో ఆదర్శంగా ఉన్నారు.