బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు దీక్ష చేస్తా.. వైఎస్ షర్మిల

ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. ఆరేళ్ల చిన్నారి చైత్రను రాజు అనే దుండగుడు ఎత్తుకెళ్లి.. అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన హైదరాబాద్ లోని సైదాబాద్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై ప్రతీ ఒక్కరూ తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇటు సెలబ్రిటీల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు ఈ ఘటనను ఖండిస్తున్నారు. నిందితుడి ఆచూకీ కోసం ప్రతీ ఒక్కరు గాలిస్తున్నారు.

ఆచూకీ తెలిపిన వారికి తెలంగాణ పోలీసులు రూ.10 లక్షలు రివార్డు కూడా ఇస్తానని ప్రకటించారు. దానికి సంబంధించి నిందితుడి ఫొటో, ఆనవాళ్లను కూడా షేర్ చేశారు. ఇప్పటికే అతడి ఫొటో ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా, మీడియాల ద్వారా ప్రజల్లోకి వెళ్లిపోయింది. కానీ అతడి ఆచూకీ మాత్రం ఇంత వరకు తెలియరాలేదు. అయితే దీనిపై వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు.

వాళ్ల కుటుంబసభ్యులను ఆమె కలిసి ఓదార్చారు. ఆ చిన్నారి ఫొటోకు పూలమాల వేసి నివాళి అర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం సంఘటనపై స్పందించే వరకు అక్కడే దీక్ష చేపడతనాని హెచ్చరిస్తూ దీక్ష చేపట్టారు. మరోవైపు బాధిత కుటుంబానికి పది కోట్ల రూపాయల పరిహారాన్ని అందించాలని ఆమె డిమాండ్ చేశారు. కేసీఆర్ అధికారంలోకి వెచ్చిన తర్వాత హత్యలు, అత్యాచారాలు రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించారు..

ఇంత పెద్ద ఘటన జరిగినా వాళ్ల కుటుంబసభ్యులను పరామర్శించడానికి ఈ ప్రాంతమంతా దత్తత తీసుకున్న మంత్రి కేటీఆర్ రాకపోవడం దురదృష్టకరం అని ఆమె మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. మంత్రి కేటీఆర్ దత్తత తీసుకున్న ప్రాంతంలోనే పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఘటన జరిగి ఆరు రోజులవుతున్నా సీఎం కేసీఆర్ స్పందించకపోవడం దారుణం. చిన్నారి చైత్ర కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదు. కేసీఆర్ నోరు విప్పి, బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చేంత వరకు నిరాహార దీక్ష చేస్తా’ అంటూ ట్విట్టర్ లో పోస్టు చేశారు.