అంత జరిగినా.. మళ్లీ బాలకృష్ణే పిలిచి తన సినిమాలో క్యారెక్టర్ ఇచ్చారు.. కోట శ్రీనివాసరావు

కోట శ్రీనివాసరావు.. వెటరన్ యాక్టర్. ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక చరిత్ర. తనకంటూ ఓ నూతన అధ్యాయాన్ని లిఖించుకున్నారు కోట శ్రీనివాసరావు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయనంటేనే ఒక చరిత్ర. వేల సినిమాలలో నటించారు ఆయన. ఆయన సినిమా కెరీర్ లో ఎన్నో క్యారెక్టర్లు. ఒక విలన్ గా, ఒక తండ్రిగా, కమెడియన్ గా, పొలిటిషియన్ గా కోట శ్రీనివాసరావు పోషించిన క్యారెక్టర్లు అద్భుతం. తన దశాబ్దాల సినిమా కెరీర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో ఆయన నటించారు. మళ్లీ కోట శ్రీనివాసరావు అంతటి గొప్ప నటుడు మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీకి దొరకడు.

ప్రస్తుతం వయసు మీద పడటంతో సినిమాలో పెద్దగా నటించడం లేదు. ఆయన ఇఫ్పుడు ఎక్కువగా తన ఆరోగ్యం మీదనే దృష్టి పెడుతున్నారు. అయితే.. కోట శ్రీనివాసరావు సినిమాల్లోకి రాకముందు.. బ్యాంక్ ఉద్యోగం చేసేవారు. బ్యాంక్ ఉద్యోగం చేసేటప్పుడే ఆయన నాటకాలు వేసేవారు. నాటకాల నుంచి సినిమాల్లోకి వచ్చారు. అయితే.. ఆయన అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ పాత్రను పోషించి చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఎన్టీఆర్ పాత్ర చేశాక.. సంవత్సరం వరకు ఎవ్వరూ వేషాలు ఇవ్వలేదు

ఏపాత్రలో అయినా సరే.. అవలీలగా జీవించేసే కోట శ్రీనివాసరావు.. అప్పట్లో తనకు సీనియర్ ఎన్టీఆర్ పాత్రను పోషించే అవకాశం వచ్చింది. కానీ.. ఆ పాత్రను ఒప్పుకోవడం వల్ల.. కోట శ్రీనివాసరావుకు చాలా సమస్యలు వచ్చాయి. ఇండస్ట్రీ మొత్తం వెలివేసింది. ఒక సంవత్సరం దాకా ఆయనకు ఎవ్వరూ వేషాలు ఇవ్వలేదట. సీనియర్ ఎన్టీఆర్ టాప్ హీరోగా ఉన్న సమయంలో.. అప్పటికే ఆయన రాజకీయాల్లోనూ రాణిస్తున్న సమయంలో.. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో.. ఆయనకు వ్యతిరేకంగా వచ్చిన సినిమా మండలాధీశుడు. ఆ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను కోట శ్రీనివాసరావు పోషించారు. ఆ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర కొంచెం నెగెటివ్ గా ఉంటుంది. కోట శ్రీనివాసరావు ఆ పాత్రను చేయడంతో.. ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా ఇండస్ట్రీలోని చాలామంది డైరెక్టర్లు, నిర్మాతలు కూడా కోటకు కొన్ని రోజుల వరకు వేషాలు ఇవ్వలేదట. చాలా చీత్కారాలు ఎదుర్కొన్నారట కోట శ్రీనివాసరావు.

ఆ పాత్రను కృష్ణ, విజయనిర్మల పట్టుపట్టి మరీ వేయించారు

ఆ సినిమాలోని పాత్రను సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల పట్టుపట్టి మరీ.. కోట శ్రీనివాసరావుతో వేయించారట. అదే సమయంలో బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్నారు కోట. ఓవైపు బ్యాంకు వాళ్లు పిలుస్తున్నారు. మరోవైపు సినిమాల్లో వేషాలు లేవు. అప్పుడే మండలాధీశుడు సినిమాలో చాన్స్ వచ్చిందట. ఏదైతే అది అయింది.. ఒకవేళ ఆ సినిమా ఆడకపోతే.. తిరిగి వెళ్లి బ్యాంకు ఉద్యోగం చేసుకుంటా.. అని కోట అనుకొని ఆ సినిమా చేశారట. కానీ.. ఆ తర్వాత ఆ సినిమా వల్ల కోట శ్రీనివాసరావు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా పాత్రలో నటించినా.. బాలకృష్ణ పిలిచి క్యారెక్టర్ ఇచ్చారు

మండలాధీశుడు సినిమాలో ఎన్టీఆర్ గా కోట శ్రీనివాసరావు నటించి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక సంవత్సరం వరకు సినిమా అవకాశాలు రాలేదు. కానీ.. అదే సమయంలో ఎన్టీఆర్ కొడుకు బాలకృష్ణ.. కోట శ్రీనివాసరావుకు పిలిచి మరీ.. తన సినిమాలో అవకాశం ఇచ్చారట. అలా.. అప్పటి నుంచి కోట శ్రీనివాసరావు తిరిగి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదట. మళ్లీ ఇండస్ట్రీలో బిజీ అయిపోయారు కోట.