దాసరి 100వ సినిమా.. చిరంజీవితో ఒకే ఒక్క సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఎలా ఆడిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

సినీ పరిశ్రమలో కాంబినేషన్స్ అలా కుదిరి పోతాయి అంతే.. మరి కొన్ని కాంబినేషన్స్ రిపీట్ కావు ఒకవేళ రిపీట్ అయినా అవి బాక్స్ ఆఫీసు వద్ద పరాజయం పొందుతాయి. 1980 ప్రారంభ దశకంలో చిరంజీవి, కోదండరామిరెడ్డి కాంబినేషన్ న్యాయం కావాలి సినిమా తో ప్రారంభం అయ్యింది. వీరి కాంబినేషన్ లో వచ్చిన దాదాపు అన్ని సినిమాలు విజయవంతం అయ్యాయి. వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా షూటింగ్ మొదలవుతుందంటే అభిమానుల్లో ‌ఎన్నో అంచనాలు ఉండేవి. న్యాయం కావాలి నుండి ముఠా మేస్త్రి వరకు అప్రతిహతంగా వీరిద్దరు సినీపరిశ్రమలో విజయఢంకా మోగించారు. ఏవో కొన్ని సినిమాలు మాత్రమే పరాజయం పొందాయి.

ఒక దశలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఖైదీ, పసివాడి ప్రాణం, అత్తకి యముడు అమ్మాయికి మొగుడు లాంటి చిత్రాలు ఇండస్ట్రీ హిట్ గా నిలిచాయి. అయితే కోదండరామిరెడ్డి కంటే ముందే కెరీర్ ప్రారంభించిన దాసరి అనేక హిట్టు, సూపర్ హిట్ సినిమాలు రూపొందించారు. ఎన్టీఆర్ తో సర్దార్ పాపారాయుడు, బెబ్బులిపులి లాంటి బ్లాక్ బస్టర్ లు దాసరి నారాయణరావు అందించారు.

అదేవిధంగా అక్కినేనితో శ్రీవారి ముచ్చట్లు, ప్రేమాభిషేకం లాంటి సూపర్ హిట్ సినిమాలను అందించారు. రాఘవేంద్రరావు, కె.విశ్వనాధ్, కోదండరామిరెడ్డి, బాపు, విజయబాపినీడు లాంటి దర్శకుల తర్వాత దాసరి నారాయణరావు దాదాపు ఆయన కెరీర్ చివరలో చిరంజీవితో ఒకే ఒక సినిమాను రూపొందించడం జరిగింది.

1989లో వడ్డే రమేష్ నిర్మాణంలో, దాసరి దర్శకత్వంలో వచ్చిన ‘లంకేశ్వరుడు’ చిత్రంలో చిరంజీవి, రాధా హీరో హీరోయిన్లుగా నటించారు. దాసరి నారాయణరావు 100వ చిత్రం చిరంజీవితో కావడం.. అభిమానుల్లోనే కాకుండా సిని పరిశ్రమలో ఆ సినిమాపై తీవ్ర అంచనాలు నెలకొన్నాయి.

మెగాస్టార్ నటించిన ‘యముడికి మొగుడు’ చిత్రానికి సూపర్ హిట్ పాటలు అందించిన రాజ్ కోటి, లంకేశ్వరుడు సినిమాకి కూడా అద్భుతమైన పాటలు అందించారు. “జివ్వుమని కొండగాలి..కత్తిలా గుచ్చుతోంది” అనే పాట మెగాస్టార్ నటించిన టాప్ టెన్ పాటల్లో ఒకటిగా నిలిచిపోయిందంటే ఆశ్చర్యపోనక్కరలేదు.

కానీ సినిమా మాత్రం బాక్సాఫీసు వద్ద పరాజయం పొందింది. ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా రేవతి నటించింది. చెల్లెలి సెంటిమెంట్ ఓవర్ డోస్ కావడంతో లంకేశ్వరుడు సినిమా పరాజయం పొందిందని ఆనాటి విమర్శకుల విశ్లేషణ. తిరిగి దాసరి చిరంజీవి కాంబినేషన్ లో మరొక సినిమా రాలేదు. కానీ విచిత్రమేమంటే లంకేశ్వరుడు సినిమా తమిళ్ లోకి డబ్ కాబడి అక్కడ ఘన విజయం సాధించింది.