బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఇవే.. ఇంటి వైద్యం వద్దు!!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రజలను భయాందోళనకు గురిచేస్తూ లక్షల సంఖ్యలో ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఈ విధంగా కరోనా నుంచి కోలుకున్న వారిలో బ్లాక్ ఫంగస్ వెంటాడుతోంది. ఈవిధంగా కరోనా నుంచి కోలుకొని బ్లాక్ ఫంగస్ వెంటాడటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.ఇప్పటికే బ్లాక్ ఫంగస్ కేసులు మహారాష్ట్ర, రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నమోదయ్యాయి. ఈ బ్లాక్ ఫంగస్ బారినపడి మహారాష్ట్రలో ఏకంగా 90 మంది మరణించారు.

ఈ క్రమంలోనే రోజురోజుకు కరోనా కేసులతో పాటు బ్లాక్ ఫంగస్ కేసులు అధికంగా పెరగడంతో ఈ వ్యాధిని ఏ విధంగా గుర్తించాలి, ఈ బ్లాక్ ఫంగస్ సోకినప్పుడు ఏ విధమైనటువంటి లక్షణాలు కనిపిస్తాయి, వ్యాధి సోకినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ఢిల్లీ ఎయిమ్స్ కొన్ని కీలక సూచనలు చేశారు.

బ్లాక్ ఫంగస్ సోకినప్పుడు ముక్కు నుంచి రక్తం కారడం, లేదా నల్లటి స్రావాలు ముక్కు నుంచి కారుతాయి. ముక్కు బిగుసుకుపోవడం, కళ్ల చుట్టూ వాపు రావడం, ఒక వస్తువు రెండుగా కనిపించడం, తలనొప్పి, కంటి నొప్పి కళ్ళు మూసి తెరుస్తున్నప్పుడు ఇబ్బందులు తలెత్తడంతో,నోరు తెరవలేకపోవడం, అన్నం నమలలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

బ్లాక్ ఫంగస్ ఎక్కువగా మధుమేహంతో బాధపడే వారిలోనూ, కరోనా బారిన పడి వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్న వారిలో, కీటోన్లు అధికంగా విడుదలవుతున్న మధుమేహ వ్యాధిగ్రస్తులలో, కరోనా చికిత్సలో భాగంగా అధిక స్టెరాయిడ్స్ తీసుకుంటున్న వారిలో, కిడ్నీ సమస్యలతో బాధపడే వారిలో ఎక్కువగా ఈ ఫంగస్ సోకే అవకాశం ఉంటుంది.

ఈ విధమైనటువంటి బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించినప్పుడు ఎవరు కూడా సొంత వైద్యం చేసుకోకూడదు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే కంటి డాక్టర్ ను సంప్రదించాలి. అదేవిధంగా మన శరీరంలో షుగర్ లెవెల్స్ ను నిలకడగా ఉంచుకోవాలి. డాక్టర్ల సూచనల మేరకే యాంటీ బయాటిక్స్, స్టెరాయిడ్లు, యాంటీ ఫంగల్ డ్రగ్స్ ఉపయోగించాలి.అదే విధంగా అవసరమైతేనే సిటి స్కాన్ చేయించుకోవాలని ఢిల్లీ ఎయిమ్స్ నిపుణులు తెలియజేశారు.