ఏపీ విద్యార్థులకు అలర్ట్.. రేపటినుంచే తరగతులు ప్రారంభం..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గతంలో రోజుకు 10,000కు అటూఇటుగా కరోనా కేసులు నమోదు కాగా ప్రస్తుతం 2,000 లోపే కొత్త కేసులు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో కేసుల సంఖ్య భారీగా తగ్గడంతో పరిస్థితులు అదుపులోకి వచ్చినట్టే అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో జగన్ సర్కార్ స్కూళ్ల రీ-ఓపెన్ షెడ్యూల్‌ లో కీలక మార్పులు చేసింది.

మొదట విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి 6,7,8 తరగతుల విద్యార్థులకు క్లాసులు ప్రారంభం కావాల్సి ఉండగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ 8వ తరగతి విద్యార్థులకు మాత్రమే క్లాసులు ప్రారంభించే విధంగా నిబంధనల్లో మార్పులు చేశామని అన్నారు. విద్యార్థులకు రేపటి నుంచి ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం `1.30 గంటల వరకు క్లాసులను నిర్వహిస్తామని తెలిపారు.

6, 7 తరగతుల విద్యార్థులకు వచ్చే నెల 14వ తేదీ నుంచి క్లాసులను ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. 8,9 తరగతుల విద్యార్థులకు మాత్రం రోజు విడిచి రోజు క్లాసులను నిర్వహించనున్నట్టు తెలిపారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు సంక్రాంతి పండగ సెలవుల తర్వాత క్లాసులను నిర్వహిస్తామని అన్నారు. కరోనా నిబంధనలను పాటిస్తూ పాఠశాలల నిర్వహణ చేపడతామని తెలిపారు.

తరగతి గదుల్లో విద్యార్థులు మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పనిసరి చేయనున్నామని అన్నారు. మారిన నిబంధనల ప్రకారం విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులను స్కూళ్లకు పంపించాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రారంభమైన స్కూళ్లలో పలు చోట్ల విద్యార్థులు, టీచర్లు కరోనా బారిన పడుతూ ఉండటం గమనార్హం.