Analyst Damu Balaji : అడగ్గానే విడాకులు… సుప్రీం కోర్ట్ సంచలనం తీర్పు…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : ప్రేమ, పెళ్లి, పిల్లలు ఇది ఒకప్పటి ట్రెండ్. ప్రేమ, పెళ్లి, విడాకులు ఇది ఇప్పటి ట్రెండ్ అనాలేమో. ప్రేమించుకోవడం, కొన్నేళలకు పెళ్లి చేసుకోవడం ఆ తరువాత కొద్ది రోజులకే విడిపోవడం ఇప్పుడు కామన్ అయింది. సినిమా ఇండస్ట్రీలో అయితే అన్యోన్యంగా ఉన్న భార్యాభర్తలు విడిపోడానికి ఎంతో సమయం పట్టడం లేదు, కారణాలు పైకి చెప్పకుండా మేము ఫ్రెండ్లీగా విడిపోతున్నాం అంటూ స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు. బాలీవుడ్ కి పరిమితమైన ఈ ట్రెండ్ ఇప్పుడు సౌత్ లో కూడా బాగానే వినిపిస్తోంది. అయితే కేవలం సినిమా తారలకే ఈ జాడ్యం ఆగిపోలేదు కామన్ వాళ్లకు కూడా పాకిపోయింది. ప్రస్తుతం భారత దేశంలో విడాకులు తీసుకుంటున్న జంటలు ఎక్కువయ్యాయి. తాజాగా సుప్రీం కోర్ట్ కూడా విడాకులు తీసుకునే జంటలకు వెసులు బాటు కల్పించడం మారిన కొత్త పోకడలకు నిదర్శనం అంటూ అనలిస్ట్ దాము బాలాజీ అభిప్రాయపడ్డారు.

ఇద్దరూ విడిపోవాలని నిర్ణయం తీసుకుంటే…

బాలాజీ ఈ ఇష్యూ గురించి మాట్లాడుతూ వివాహ వ్యవస్థ రానురాను దేశంలో ఫెయిల్ అవుతోందని చెప్పారు. ఫ్రీడమ్ పెరగడం, ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ సంపాదించడం వంటివి విడిపోడానికి ఒకరకంగా కారణాలు కాగా సహజీవనం వంటివి ఇతర కారణాలు అంటూ చెప్పారు. హిందూ వివాహ చట్టం 1955 అలాగే స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ 1954 ఈ రెండింటిలోనూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్పులు సవరించినా ఇప్పటికీ మరిన్ని మార్పులు అవసరం అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు. ఇద్దరు వ్యక్తులు పెళ్ళైన కొంతకాలనికే విడిపోవాలని భావిస్తే విడాకులు వెంటనే ఇవ్వాలని సుప్రీం కోర్ట్ తాజాగా తీర్పు ఇచ్చింది.

ఒకరు విడాకులు కావాలని మరొకరు వద్దు అనుకున్నపుడు ఏళ్లకేళ్ళు ఆ కేసులు కోర్టుల్లో నలుగుతున్నాయి. కానీ ఇద్దరూ మ్యూచువల్ కన్సెంట్ తో విడిపోవాలనుకున్నపుడు వెంటనే విడాకులు మంజూరు చేయాలని సుప్రీం కోర్ట్ తాజాగా తీర్పు ఇచ్చింది. గతంలో మ్యూచువల్ కన్సెంట్ అయినా ఆరు నెలలు వారి నిర్ణయం మార్చుకోడానికి గడువు కోర్ట్ ఇచ్చేది. దానివల్ల వాళ్ళు మరో ఆరు నెలలు మానసిక వేదనకు గురవ్వుతారని, అలాగే వేరే పెళ్లి చేసుకోవాలన్నా 90 రోజులు ఆగాల్సి రావడం వంటి నిబంధనల వల్ల నష్టపోతున్నారని భావించి సుప్రీం కోర్ట్ ఈ తీర్పు ఇచ్చినట్లు బాలాజీ తెలిపారు.