కరోనా చికిత్సకు సరికొత్త ఔషధం..?

ప్రపంచవ్యాప్తంగా ప్రళయం సృష్టిస్తున్న కరోనా వైరస్ ను కట్టడి చేయడం కోసం ఇప్పటికే పలు రకాల కంపెనీలకు చెందిన వ్యాక్సిన్ లు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కి వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఈ కరోనా వైరస్ ను కట్టడి చేయడం కోసం మరొక కొత్త మందు త్వరలోనే మార్కెట్లోకి రానుంది.

ఇప్పటికే అమెరికా, బ్రిటన్‌ దేశాల్లో జంతువులు, మనుషులపై రెండు దశలో క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి చేసుకున్న ‘మోల్నుఫిరావిర్‌–400ఎంజీ ’మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు సిద్ధమైంది. మనదేశంలో మొట్టమొదటిసారిగా యశోద ఆస్పత్రిలో ఈ ట్రయల్స్ నిర్వహించనున్నారు.ఈ మేరకు శుక్రవారం ఆస్పత్రి మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ లింగయ్య తెలియజేశారు.

ఈ ఔషధంతో ఇప్పటి వరకు జరిపిన రెండు దశల ట్రయల్స్ లో భాగంగా ఈ మందు జంతువులు, మనుషులపై ఎంతో సమర్థవంతంగా పనిచేసిందని, ఔషధం వల్ల ఏ ఒక్కరిలో కూడా ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తలేదని తెలిపారు. ఈ మందును కరోనా బాధితులలో ఉపయోగించడం వల్ల కరోనా నుంచి తొందరగా కోలుకున్నట్లు తెలియజేశారు.

మూడో దశలో భాగంగా దేశవ్యాప్తంగా 34 ఆస్పత్రుల్లో 1,218 మందిని ఈ ట్రయల్స్‌కు ఎంపిక చేయగా, యశోద ఆస్పత్రిలో 50 మందిపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. కేవలం ఐదు రోజుల పాటు ఈ మందులను వాడి ఆ తర్వాత ఆర్టీపీసీఆర్‌ టెస్టు చేయగా, నెగెటివ్‌ వచ్చినట్లు వెల్లడించారు. ప్రస్తుతం మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతుండగా మరి రెండు నెలలలో ఇవి పూర్తికాగానే నాలుగవ దశ ట్రయల్స్ కూడా జరుగుతాయని. యశోద ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ తెలిపారు.