AP Election Results : తొలి ఫలితం నగరి నుంచే.. మొదట తేలేది రోజా జాతకమే..!

మరో మూడు రోజుల్లో ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌లో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇక్కడ లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సైతం వెలువడనున్నాయి. పైగా వైసీపీ వర్సెస్ కూటమి హోరాహోరా పోరు జరిగింది. ఎప్పుడైనా హోరాహోరీ పోరు జరిగితేనే కదా.. నరాలు తెగే ఉత్కంఠ ఉండేది. ప్రస్తుతం ఏపీలో పరిస్థితి అలాగే ఉంది. ఇరు పార్టీలు విజయంపై ధీమాతోనే ఉన్నట్టు కనిపిస్తున్నాయి. లోలోపల ఎలా ఉన్నారనేది వారికే ఎరుక. జూన్ నాలుగో తేదీన ఉదయం 11 గంటల వరకూ ఏపీలో ఏ పార్టీ గెలుస్తుందనే విషయంపై పక్కాగా ఓ క్లారిటీ వస్తుంది. ఇక ఏపీలోని అన్ని ప్రాంతాల కంటే ముందుగా వెలువడేది వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా జాతకమే. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ ఫలితం మొదట రానుందని తెలుస్తోంది. తొలి ఫలితం వైసీపీకి సక్సెస్‌ను అందిస్తుందా? లేదంటే ముంచేస్తుందా?

12 గంటల్లోపే తేలనున్న రోజా జాతకం..

చిత్తూరు జిల్లాలో మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో చిన్న నియోజకవర్గం నగరి. ఇక్కడి నుంచే ఏపీలో తొలి ఫలితం వెలువడనుందని టాక్. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఓటర్లు 2,02,574 మాత్రమే. 229 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరిగింది. ఇక కౌంటింగ్ కోసం 14 టేబుళ్లను ఏర్పాటు చేయనున్నారు. మొత్తంగా 17 రౌండ్లలో ఫలితం తేలనుంది. తొలి ఫలితం మధ్యాహ్నం 12 గంటలలోపే వచ్చే అవకాశం ఉంది. అంటే 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు రోజా జాతకం తేలిపోతుందన్న మాట. వాస్తవానికి నగరి నియోజకవర్గం గతంలో అయితే వైసీపీకి చాలా బాగుండేది. అలాంటిది ఈ ఎన్నికల సమయంలో పార్టీకి అండగా నిలిచిన వారంతా టీడీపీలోకి జంప్ చేశారు. దీనికి కారణం లేకపోలేదు లెండి. అంతా రోజమ్మే చేశారు. అధికారం కట్టబెట్టినప్పుడు ఎలా ఉండాలి? కానీ ఆమె ఎవ్వరినీ దగ్గరకు రానివ్వలేదు. అధికారం తనది.. పెత్తనం అన్నలది. వారు ప్రతి పనికీ రేటు ఫిక్స్ చేసి మరీ వసూళ్లు చేశారని సొంత పార్టీ నేతలే మండిపడ్డారు.

రోజా టాక్స్.. అన్నల దందా..

వైసీపీని వీడిన నేతలు సైతం రోజా బాగోతాన్ని బయటపెట్టే వీడారు. రోజా టాక్స్ మొదలుకుని అవినీతి.. దందాలు అన్నీ బయట పెట్టారు. ఇక పార్టీ టికెట్లను కేటాయిస్తున్న సమయంలోనే రోజాకు మాత్రం టికెట్ ఇవ్వొద్దని స్థానిక నేతలంతా అధిష్టానానికి మొరబెట్టుకున్నారు. ఒకవేళ ఇచ్చినా కూడా సహకరించబోమని వెల్లడించారు. వాస్తవానికి నగరిలో రోజాకు విపక్షాల కంటే సొంత పార్టీ నేతలే ఎక్కువగా ఎదురు తిరిగారు. ఆమె ఓటమికి సొంత పార్టీ నేతలే కృషి చేశారు. రోజా టాక్స్.. అన్నల దందాలతో ఎక్కడలేని నెగిటివ్ రోజాపై వచ్చింది. మొత్తానికి రోజాను ఈసారి అసెంబ్లీ గేటును కూడా టచ్ చేయనివ్వకూడదని వైసీపీ నేతలు గట్టిగానే కష్టపడ్డారు. అలాగే నగరిలో టీడీపీ నుంచి గాలి భాను ప్రకాష్ పోటీ చేశారు. ఆయన ఈసారి గట్టిగానే కష్టపడ్డారు. కాబట్టి ఆయన ఈసారి పక్కాగా గెలుస్తారని అంటున్నారు. రోజా సవాళ్లైతే మరోలా ఉన్నాయి. గాలిని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వబోనని సవాల్ చేశారు. మరి ఇంత ధీమాతో ఉన్న రోజా గెలుస్తారో.. గాలి భానుప్రకాష్ గెలుస్తారో చూడాలి.