ఏపీ మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. అక్కడ మద్యం బంద్..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మందుబాబులకు ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. పోలింగ్ తేదీకి 44 గంటల ముందు మద్యం విక్రయాలను నిలిపివేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరి నెల 9,13,17,21 తేదీలలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో గ్రామస్థాయిలో జరగనున్న ఎన్నికలు కావడంతో భారీగా ఎన్నికలకు సిబ్బంది అవసరమవుతోంది. ప్రభుత్వం ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది.

రాష్ట్ర ప్రభుత్వం పంచాయితీ ఎన్నికలు జరిగే సమయంలో సెలవులను ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు ఎలక్షన్ ఏజెంట్లుగా వ్యవహరించకూడదని ఆదేశాలను జారీ చేసింది. ఎన్నికలు జరిగే తేదీలలో ప్రభుత్వ కార్యాలయాలతో పాటు దుకాణాలు, పాఠశాలలకు కూడా సెలవు దినాలుగా ఉన్నాయి. ప్రభుత్వ భవనాలు ఎన్నికల కొరకు పోలింగ్ కేంద్రాలుగా మారనున్నాయి.

ఎన్నికల ఫలితాలను బట్టే జగన్ సర్కార్ పాలన గురించి ప్రజల అభిప్రాయం తెలిసే అవకాశం ఉండటంతో ఈ ఫలితాల గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటగా ఏడాదిన్నర పాలనలో వైసీపీపై ప్రజల్లో ఏ విధమైన అభిప్రాయం ఉందో ఈ ఎన్నికల ద్వారా తేలనుంది. మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

వివిధ జిల్లాల కలెక్టర్ల ద్వారా ఆయన ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోనున్నారు. సరైన సమయంలో ఎన్నికల నిర్వహణ జరగడం రాజ్యాంగ హక్కు అని ఆయన పేర్కొన్నారు. బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడటం తగదని ఆయన అన్నారు.