గణేశ్ ఉత్సవాలపై ఆంక్షలు.. మాంసం అమ్మకాలపై నిషేధం..

వినాయక చవితి సందర్భంగా మాంసం అమ్మకాలపై నిషేధం విధించింది. సెప్టెంబర్ 10న వినాయక చవితి సందర్భంగా బెంగళూరు నగరంలో మాంసం అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. జంతువులను చంపడం, మాంసం అమ్మకాన్ని నిషేధిస్తూ బీబీఎంపీ జాయింట్ కమిషనర్ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి.

నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని నగర పాలిక సంస్థ హెచ్చరించింది. సెప్టెంబర్ 10 నుంచి నగరంలో మూడు రోజుల గణేశ పూజ వేడుకలను మాత్రమే బహిరంగ ప్రదేశాలలో అనుమతించింది. విగ్రహాన్ని తీసుకొచ్చేటప్పుడు లేదా నిమజ్జనం చేసే సమయంలో ఎలాంటి ఊరేగింపు ఉండరాదని అధికారులు తేల్చి చెప్పారు.

బీబీఎంపీ చీఫ్ కమిషనర్ గౌరవ్ గుప్తా మాట్లాడుతూ.. బెంగళూరు నగరంలో గణేశ ఉత్సవాన్నిమూడు రోజులకు మించి అనుమతించబోమని ఎలాంటి ఊరేగింపు ఉండరాదని చెప్పారు. అంతే కాకుండా ఉత్సవాల్లో 20 మందికి మించి పాల్గొనకూదని కూడా ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు.

కరోనాను కట్టడి చేసేందుకు పండుగ సమయంలో నైట్ కర్ఫ్యూ అమలు జరుగుతుందని ఈ నిబంధనలు తేల్చి చెప్పాయి. కేవలం మట్టి విగ్రహాలకే అనుమతులు ఉన్నాయని, అలాగే చవితి ఉత్సవాల్లో ఆహారం లేక ప్రసాదం పంపిణీకి కూడా అనుమతించబోమని ప్రభుత్వం తెలిపింది. కరోనా కేసులు పెరుగుతున్న జిల్లాలో ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. గతేడాది కూడా కరోనా కారణంగానే ఉత్సవాలపై ఆంక్షలు విధించగా.. ఈ సారి కూడా అవే ఆంక్షలను కొనసాగిస్తున్నారు అధికారులు.