తాగొచ్చి రచ్చ చేసిన పెళ్లికొడుకు.. పెళ్లి కూతురు చేసిన పనికి?

సాధారణంగా పెళ్లి జరుగుతుంది అంటే వధువు, వరుడు ఎంతో సాంప్రదాయంగా వ్యవహరిస్తూ పెళ్లి వేడుక కార్యక్రమాన్ని జరుపుకుంటారు. కానీ ఈ పెళ్లి కొడుకు మాత్రం పెళ్లిరోజు తప్ప తాగి వచ్చి నానా హంగామా చేశాడు. మరికాసేపట్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు ఫుల్లుగా తాగి రోడ్డెక్కి స్నేహితులతో కలిసి డాన్సులు చేస్తూ వింతగా ప్రవర్తించాడు. ఈ విధంగా వరుడు ప్రవర్తించిన తీరుకు విసుగుచెందిన వధువు ఈ పెళ్లి పట్ల కఠిన నిర్ణయం తీసుకోవడంతో ఈ పెళ్లి చివరికి పెటాకులుగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే…

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లా టిక్రీ అనే గ్రామానికి చెందిన ఓ రైతు తన కూతురి వివాహం కుతిలియా అహీనా గ్రామానికి చెందిన రావేంద్ర పటేల్‌తో జరపడానికి నిశ్చయించారు. ప్రస్తుతం కరోనా కారణంగా కర్ఫ్యూ ఉండడంతో వధువు తండ్రి అందుకు తగ్గ ఏర్పాట్లు చేశాడు.మరికాసేపట్లో పెళ్లి కార్యక్రమం జరగబోతుందన్న క్రమంలో వరుడు ఫుల్ గా తాగి కళ్యాణ వేదిక దగ్గరకు చేరుకొని రచ్చ రచ్చ చేశాడు.

ఈ విధంగా వరుడు తాగి డాన్సులు చేస్తూ రావడంతో పెద్దగా పట్టించుకోని వధువు కుటుంబం చివరికి వరుడి ప్రవర్తనతో ఎంతో విసుగు చెందారు. ఈ క్రమంలోనే వరుడు ప్రవర్తన నచ్చక వధువు పెళ్లి చేసుకోవడానికి నిరాకరించి వేదిక నుంచి వెళ్ళిపోయింది. ఈ క్రమంలోనే వధువు కుటుంబసభ్యులు వరుడు కుటుంబ సభ్యులను మండపంలోనే నిలబెట్టారు.

వివాహం నిశ్చయ సమయంలో వధువు కుటుంబసభ్యులు వరుడు కుటుంబానికి ముట్ట చెప్పిన కట్న కానుకలను తిరిగి ఇవ్వాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.కట్నకానుకలు తిరిగి ఇవ్వడానికి వరుడు కుటుంబ సభ్యులు ఒప్పుకోక పోగా ఈ విషయం కాస్తా పోలీసుల వరకు పాకింది. ఈ క్రమంలోనే పోలీసుల వరకు వ్యవహారం వెళ్లడంతో వరుడు కుటుంబ సభ్యులు చేసేదేమీలేక వధువు కుటుంబ సభ్యులు సమర్పించిన కట్న కానుకలను తిరిగి ఇచ్చేశారు.