Central govt : సత్యమేవ జయతే కాస్త సింహమేవ జయతిలా ఉంది… కొత్త జాతీయ చిహ్నం రూపురేఖలపై విపక్షాల విమర్శలు…!

Central govt : మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నూతన పార్లమెంట్ భవనం లో జాతీయ చిహ్నం అయిన సింహాలకు సంబంధించిన రూపురేఖలను ప్రధాని మోడీ విడుదల చేసారు. అయితే పాత చిహ్నం లోని సింహాల రూపురేఖలకు, ప్రస్తుత చిహ్నం లోని సింహాలకు తేడా కనిపిస్తుండడంతో విపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే పలువురు పౌర నేతలు, నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో వేదికగా విమర్శిస్తున్నారు.

గాంధీ నుండి గాడ్సే లాగా మారింది…

మన జాతీయ చిహ్నం అయిన సింహాలు సారనాథ్ అశోక స్థూపం నుండి స్వీకరించబడింది. ఈ సింహాల కింద సత్యమేవ జయతే అనే వాక్యం కూడా ఉంటుంది. అయితే ఆ సింహాలు చాలా గంభీరంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి కానీ ప్రస్తుతం కొత్తగా విడుదలైన ఈ చిహ్నం లో సింహాలు రౌద్రంగా, కోరలు చాచి క్రూరంగా ఉన్నాయంటూ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ మరియు విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ నుండి, అశోక స్తంభంలోని సింహాల రూపాలు, గుణగణాలను మార్చడమంటే జాతీయ చిహ్నాన్ని అవమానించడమేనని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. నూతన పార్లమెంటుపై నిర్మాణాన్ని చూస్తే, ‘సత్యమేవ జయతే’ నుంచి ‘సింహమేవ జయతే’లా పరిస్థితులు మారినట్లు కనిపిస్తున్నాయని తృణమూల్‌ నేత మహువా మొయిత్రా వ్యంగ్యంగా అన్నారు. ‘గాంధీ నుంచి గాడ్సే వరకు’ అంటూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ ఈ వ్యవహారంపై ట్వీట్‌ చేశారు.

విపక్షాల ఆరోపణలను తోసిపుచ్చిన ప్రభుత్వం…

జాతీయ చిహ్నానికి సంబంధించి ఇచ్చిన డిజైన్లలో ఏ మార్పులు తాను చేయలేదని నిర్మాణ రూపశిల్పి లక్ష్మణ్‌ వ్యాస్‌ స్పష్టం చేశారు. టాటా కంపెనీ చేసి ఇచ్చిన మట్టి నమూనా ఆధారంగా జైపుర్‌లో తాము కాంస్య విగ్రహం తయారుచేశామని తెలిపారు. విపక్షాల విమర్శలను అధికార పార్టీ ఖండించింది. సారనాథ్‌ స్తూపం తరహాలోనే పార్లమెంటుపై జాతీయ చిహ్నం ఉందని పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి అనిల్‌ బలూని అన్నారు. ప్రతిపక్షాలు అనవసరపు విమర్శలు చేస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సారనాథ్‌ స్తూపం, ప్రస్తుత నిర్మాణం కొలతల్లో చాలా తేడా ఉందని, అందుకే సింహాల రూపురేఖలు మారినట్లు కొందరికి అనిపిస్తుండొచ్చని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురి ట్వీట్‌ చేశారు.

ఒకవేళ సారనాథ్‌ చిహ్నం పరిమాణాన్ని పెంచితే, పార్లమెంటు భవనంపై ఏర్పాటుచేసిన చిహ్నాన్ని తగ్గిస్తే రెండింటిలో తేడా కనిపించదని స్పష్టం చేశారు. విగ్రహ రూపురేఖల్లో కొంత తేడాలున్నంత మాత్రాన జాతీయ చిహ్నాన్ని అవమానించినట్లు కాదని మరికొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు. సారనాథ్‌లోని స్తూపంతో పోలిస్తే కొత్త విగ్రహం చాలా రెట్లు పెద్దదని గుర్తుచేశారు. అందువల్లే రూపురేఖల్లో మార్పులు కనిపిస్తుండొచ్చని వ్యాఖ్యానించారు.